అంతర్రాష్ట్ర సైబర్‌‌‌‌ గ్యాంగ్‌‌‌‌ అరెస్ట్.. 189 కేసుల్లో రూ.9 కోట్లు కొల్లగొట్టిన ముఠా

  • బాధితులంతా మన రాష్ట్రం వారే
  • రాజస్థాన్‌‌‌‌లో సీఎస్‌‌‌‌బీ ఆపరేషన్లు
  • ఏడుగురు మ్యూల్‌‌‌‌  అకౌంట్స్‌‌‌‌ సప్లయర్లు అదుపులోకి
  • దేశవ్యాప్తంగా 2,223 కేసులతో సంబంధాలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సైబర్‌‌‌‌  నేరగాళ్లకు మ్యూల్‌‌‌‌ అకౌంట్స్‌‌‌‌ (సైబర్  కేటుగాళ్లు ఇచ్చే డబ్బులకు ఆశపడి వారికి బ్యాంకు ఖాతాలను అమ్ముకోవడం) సప్లయ్‌‌‌‌  చేస్తున్న మరో ఏడుగురు సభ్యుల ముఠాను టీజీ సైబర్‌‌‌‌  సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌‌‌‌బీ) అధికారులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌‌‌‌లోని జైపూర్‌‌‌‌, జోధ్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌  పాలి జిల్లాలో గత వారం టీజీసీఎస్ బీ అధికారులు సెర్చ్‌‌‌‌ ఆపరేషన్‌‌‌‌  చేశారు. ఏడుగురిని అరెస్టు చేసి హైదరాబాద్‌‌‌‌ కు  తరలించారు. నిందితుల వద్ద నుంచి 9 సెల్‌‌‌‌ఫోన్లు, ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌, లగ్జరీ కారు, రూ.97 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వివరాలను టీజీసీఎస్‌‌‌‌బీ డైరెక్టర్‌‌‌‌  శిఖా గోయల్‌‌‌‌  మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ట్రేడింగ్‌‌‌‌,ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌  ఫ్రాడ్స్‌‌‌‌, డిజిటల్  అరెస్ట్‌‌‌‌  కేసుల్లో ఈ ఏడాది సెప్టెంబరులో రాజస్థాన్‌‌‌‌లో సీఎస్‌‌‌‌బీ బృందాలు సెర్చ్‌‌‌‌  ఆపరేషన్  చేశాయి. 

రాష్ట్రంలో నమోదైన 189 కేసులు, దేశవ్యాప్తంగా నమోదైన 2,223 కేసులతో సంబంధం ఉన్న 27 మంది సైబర్  నేరగాళ్లను అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్‌‌‌‌ తెలంగాణలో బాధితుల నుంచి రూ.9 కోట్లు కొల్లగొట్టింది. నిందితులు ఇచ్చిన సమాచారంతో  జైపూర్‌‌‌‌‌‌‌‌, జోధ్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లో మరోసారి సెర్చ్‌‌‌‌  ఆపరేషన్‌‌‌‌ చేశారు. సైబర్ నేరగాళ్లు కొట్టేసిన డబ్బును విత్‌‌‌‌ డ్రా చేస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఇలా డ్రా చేసిన డబ్బును కమీషన్లు తీసుకుని తిరిగి సైబర్‌‌‌‌‌‌‌‌  నేరగాళ్ల ఖాతాల్లో నిందితులు డిపాజిట్‌‌‌‌  చేస్తున్నట్లు గుర్తించారు. వారిని రాజస్థాన్ లోని స్థానిక కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్‌‌‌‌  వారంట్లపై హైదరాబాద్‌‌‌‌కు తరలించారు. ఈ అంతర్రాష్ట్ర ఆపరేషన్‌‌‌‌లో డీఎస్పీలు సూర్యప్రకాష్, వేణుగోపాల్‌‌‌‌ రెడ్డి, విజయ్‌‌‌‌ కుమార్‌‌‌‌తో సహా సీఎస్‌‌‌‌బీ టెక్నికల్‌‌‌‌ టీమ్ పాల్గొన్నదని డీజీ శిఖా గోయల్‌‌‌‌  తెలిపారు.