కళాకారులకు అండగా కాంగ్రెస్​ ప్రభుత్వం : వెన్నెల గద్దర్​

  • తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్మన్​ వెన్నెల గద్దర్​

రామచంద్రాపురం, వెలుగు: రాష్ట్రంలోని పేద కళాకారులందరికీ కాంగ్రెస్​ ప్రభుత్వం అండగా ఉందని తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్మన్​ వెన్నెల గద్దర్ తెలిపారు. చైర్మన్​​గా నియామక పత్రాలు అందుకున్న తర్వాత శుక్రవారం రాత్రి తెల్లాపూర్​లోని గద్దర్​ విగ్రహానికి ఆమె ఘనంగా నివాళులర్పించారు. తెల్లాపూర్​ కౌన్సిలర్​ కొల్లూరి భరత్​ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెన్నెల మాట్లాడుతూ..  ప్రజా యుద్ధ నౌకగా నిలిచిన గద్దర్​ ఆశయాలకు అనుగుణంగా కళాకారుల సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు.

 గద్దర్ బిడ్డగా దేశంలోని ప్రతి ఒక్కరికీ భారత రాజ్యాంగాన్ని పాట ద్వారా తెలియజేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 70 వేల మంది కళాకారుల అభ్యున్నతి కోసం పని చేస్తానని చెప్పారు. తెలంగాణ కోసం నిజమైన త్యాగాలు చేసిన వారిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదరిస్తోందని, వారికి సముచిత గుర్తింపును ఇస్తోందన్నారు. 

గద్దర్​ కూతురు వెన్నెలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యుత్తమ పదవిని అందించి గద్దర్​పై ఉన్న చిత్తశుద్ధిని చాటుకున్నారని కౌన్సిలర్​ భరత్​ అన్నారు. కార్యక్రమంలో కొల్లూరి సత్తయ్య, పసునూరి రవీందర్​, ప్రభాకర్​ రెడ్డి, వివేక్​, గద్దర్​ అభిమానులు, పలువురు కళాకారులు పాల్గొన్నారు.