ఏపీ CM చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ కృతజ్ఞతలు

హైదరాబాద్: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు స్వీకరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గత సంప్రదాయం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ సభ్యులు ఇచ్చే సిఫారసు లేఖలు పరిగణలోకి తీసుకుని స్వామివారి దర్శనానికి, ఆర్జిత సేవలకు అవకాశం కల్పించేందుకు ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. 

తెలంగాణ ప్రజలకు తిరుమలలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామికి వందల సంవత్సరాలుగా విడదీయరాని ఆధ్యాత్మిక అనుబంధం ఉందని.. తెలంగాణ నుండి ప్రతి రోజు కొన్ని వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని పేర్కొన్నారు. స్వామి వారిని భక్తితో కొలిచి, దర్శించుకునే వారి సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతునే ఉందని తెలిపారు. కాగా, గత కొన్ని రోజులుగా తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫారసు లేఖలను తిరుమల అధికారులు పరిగణలోకి తీసుకోవడం లేదు. 

Also Read :- డిసెంబర్ 31 అర్దరాత్రి 12.30 వరకు మెట్రో సేవలు

దీంతో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను స్వీకరించాలని ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు స్వీకరించేందుకు సీఎం చంద్రబాబు ఒకే చెప్పారు. టీటీడీ దర్శనాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధులకు నుండి వారానికి 4 సిఫార్సు లేఖలకు సీఎం చంద్రబాబుకు అంగీకారం తెలిపారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు వారానికి రెండు బ్రేక్(రూ.500) దర్శనాలతో పాటు, రెండు స్పెషల్ ఎంట్రీ (రూ. 300) దర్శనం లేఖలకు అనుమతిస్తామన్నారు. ప్రతి లేఖలో ఆరుగురు భక్తుల వరకు దర్శనానికి సిఫారసు చేయవచ్చని తెలిపారు.