నియోజకవర్గాల పునర్విభజనతో సౌత్​ స్టేట్స్​కు నష్టం : సీఎం రేవంత్​ రెడ్డి

  • దీనిపై ఏఐసీసీ దృష్టిపెట్టాలి
  • దేశమంతా జనగణనతో పాటే కులగణన కూడా చేపట్టాలి
  • ఈ అంశంపై పోరాటాలు చేయాలి
  • కేంద్రానికి తీర్మానం చేసి పంపాలి
  • బెళగావి సీడబ్ల్యూసీ భేటీలో ప్రతిపాదన ఆమోదించిన కమిటీ

హైదరాబాద్, వెలుగు:  జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టమని, జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు, దక్షిణాదిన తక్కువ సీట్లు పెరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి కూడా దీని వల్ల నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు.

ఈ విషయంపై ఏఐసీసీ వ్యూహాత్మకంగా ఆలోచించి, నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకుండా జాగ్రత్తగా అడుగులు వేయాలని ఆయన కోరారు. గురువారం సాయంత్రం కర్నాటకలోని బెళగావిలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి సీఎం రేవంత్​రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్ట సభల్లో మహిళా బిల్లును కాంగ్రెస్  ప్రభుత్వ హయాంలోనే ప్రవేశపెట్టి ఒక కొలిక్కి తెచ్చినందున, ఈ అంశంపై మనం ఎక్కువగా ప్రచారం చేయాలన్నారు. 

మహిళ బిల్లుతో కేంద్ర ప్రభుత్వం బీజేపీకి  అనుకూలంగా రిజర్వేషన్లు చేసుకునే అవకాశాలు ఉన్నాయని.. ఈ  విషయంలో కూడా కాంగ్రెస్ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. తెలంగాణలో కులగణన చేపట్టి దేశానికే  మార్గదర్శిగా నిలుస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాది దేశ్యవాప్తంగా చేయబోతున్న జనగణనతోపాటే  కులగణన చేపట్టేలా కాంగ్రెస్  పార్టీ పోరాటం చేయాలన్నారు. ఈ అంశంపై సీడబ్ల్యూసీ ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని సీఎం రేవంత్​రెడ్డి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై సమావేశం తీర్మానం చేసి ఏకగ్రీవంగా ఆమోదించింది. 

రాజ్యాంగాన్ని తిరగరాయలని బీజేపీ చూస్తున్నది: మహేశ్​ గౌడ్​

సరిగ్గా వందేండ్ల కింద ఇదే బెళగావిలో మహాత్మా గాంధీని ఏఐసీసీ అధ్యక్షుడిగా సీడబ్ల్యూసీ ఎన్నుకున్నదని పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​ గౌడ్​ గుర్తుచేశారు. సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా గాంధీ సిద్ధాంతాలను, విధానాలను ఆచరిస్తారని, అందుకు ఆయన వ్యక్తిత్వమే కారణమని తెలిపారు. కులగణన అనేది దేశమంతా స్వాగతించాల్సిన అంశమన్నారు. ‘‘కులాల పేరిట, మతాల పేరిట రాజకీయాలు చేస్తూ దేశాన్ని విభజించి పాలిస్తూ.. రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్న బీజేపీ కుటిల రాజకీయ ఎత్తుగడలకు కులగణన చెంపపెట్టు లాంటిది. రాహుల్​గాంధీ ఆలోచనతో తెలంగాణలో కులగణన చేపడ్తున్నం. 

దీనికి రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది” అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే  90 శాతం కులగణన పూర్తయిందన్నారు. రాజ్యాంగాన్ని, చరిత్రను తిరగరాయలని బీజేపీ చూస్తున్నదని మండిపడ్డారు.  ఈ మీటింగ్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ దీపాదాస్ మున్షి, ఇతర నేతలు పాల్గొన్నారు.

 ఏఐసీసీ అధ్యక్షులుగా మహాత్మా గాంధీ బాధ్యతలు స్వీకరించి వందేండ్లు పూర్తయిన సందర్భంగా ‘నవ సత్యాగ్రహా’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పార్టీ జాతీయ నేతలు, పీసీసీ చీఫ్​లు హాజరయ్యారు. గురువారం ఉదయం బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్​లో సీని ప్రముఖులతో సమావేశమైన సీఎం, డిప్యూటీ సీఎం.. అక్కడి నుంచి నేరుగా బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లి, ప్రత్యేక విమానంలో బెళగావికి చేరుకొని మీటింగ్​కు అటెండ్​ అయ్యారు.