- వైఎస్ అసలైన వారసురాలు షర్మిలనే: రేవంత్
- వైజాగ్‌లో ‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’ సభకు హాజరు
హైదరాబాద్, వెలుగు: బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అభివర్ణించారు. ఇందులో ఎవరికి ఓటేసినా అది వెళ్లేది బీజేపీకేనన్నారు. ఏపీకి కావాల్సింది పాలకులు కాదని, ప్రశ్నించే గొంతుకలని తెలిపారు. ఆ ఇద్దరు (చంద్రబాబు, జగన్మోహన్రెడ్డి) పాలించే నాయకులు కావాలనుకుంటున్నారే తప్ప ప్రశ్నించే గొంతుకలు కావాలనుకోవడం లేదని విమర్శించారు. ఇక్కడి నాయకులకు ప్రశ్నించేతత్వం లేనందునే పోలవరం పూర్తికాలేదని, రాజధాని ఎక్కడో చెప్పలేని పరిస్థితి నెలకొందని అన్నారు.
ఏపీలోని విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘విశాఖ ఉక్కు-–ఆంధ్రుల హక్కు’ న్యాయసాధన సభలో రేవంత్ పాల్గొని, ప్రసంగించారు. భౌగోళికంగా విడిపోయినా తెలుగు వారిగా మనమంతా ఒక్కటేనని తెలిపారు. 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అదానీ కోసం ప్రధాని మోదీ విక్రయిస్తుంటే ఇక్కడి పహిల్వాన్లుగా చెప్పుకుంటున్న నాయకులు ప్రశ్నించడం లేదని ఎద్దేవా చేశారు. మనం కలిసి పోరాడితే ఢిల్లీ సుల్తానులు, జాగీరార్దులు, పాలకులు ఎవరైనా తలవంచాల్సిందేనన్నారు.
చట్టసభల్లో అవకాశమివ్వండి
ఏపీలో కాంగ్రెస్ లేదు.. మీరు అక్కడకు వెళ్లొద్దని కొందరు సన్నిహితులు తనకు సూచించారని, కానీ వైఎస్సార్ వారసురాలు షర్మిల సభ పెడితే ఆయన అభిమానులు అండగా నిలుస్తారని భావించి తాను వచ్చానని రేవంత్ పేర్కొన్నారు. ఈ సభను చూస్తుంటే కాంగ్రెస్ కార్యకర్తలతో హైదరాబాద్‌లో సభ పెట్టినట్టుగా ఉన్నదని, తన నమ్మకాన్ని నిలబెట్టినందుకు వైఎస్సార్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రపదేశ్నుంచి కాంగ్రెస్ తరఫున ఐదురుగు ఎంపీలు, శాసనసభకు 25 మంది ఎమ్మెల్యేలను పంపాలని, చట్ట సభల్లో ప్రాతినిథ్యం వహించే అవకాశం కల్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
షర్మిలను సీఎం చేయాలి
ఉమ్మడి రాష్ట్రంలో 1994లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 26 స్థానాలే వచ్చాయని, ఆ దశలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టేందుకు అధిష్టానం వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించిందని రేవంత్ గుర్తుచేశారు. వైఎస్సార్ ప్రశ్నించే గొంతుకై పోరాడటంతో 1999లో కాంగ్రెస్ 91 ఎమ్మెల్యేలకు చేరిందని, చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు సాగించిన పాదయాత్రతో 2004లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. నాడు ఏపీ నుంచి వచ్చిన 33 ఎంపీ సీట్లతోనే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని చెప్పారు.
రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడమేనని, అందుకు కష్టపడుతున్న షర్మిలనే రాజశేఖర్‌రెడ్డికి నిజమైన వారసురాలన్నారు. రాజశేఖర్‌రెడ్డి ఆఖరి వరకు మూడు రంగుల జెండానే కప్పుకొన్నారని, ఇప్పుడు షర్మిల ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. షర్మిలకు అండగా నిలిచి సీఎంను చేయాలని, ఏపీకి తాను అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు.