రాజ్ భవన్ ఎదుట రోడ్డుపై బైఠాయించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. హైదరాబాద్ సిటీ నడిబొడ్డున.. రాజ్ భవన్ ఎదుట రోడ్డుపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డినే రోడ్డుపై బైఠాయించటం ఆసక్తి రేపింది. ఇంతకీ సీఎం రేవంత్ రెడ్డి.. రోడ్డుపై బైఠాయించటానికి.. నిరసన వ్యక్తం చేయటానికి కారణం ఏంటో తెలుసుకుందాం..

అదానీ విషయంపై పార్లమెంట్లో చర్చకు కేంద్రం అంగీకరించకపోవటం.. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ మాట్లాడాలని డిమాండ్ చేస్తూ.. దేశ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.. అసెంబ్లీ నుంచి గవర్నర్ రాజ్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించింది పీసీసీ. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

అసెంబ్లీ నుంచి రాజ్ భవన్ చేసుకున్న తర్వాత.. రాజ్ భవన్ ఎదుటనే సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు అందరూ రోడ్డుపై బైఠాయించారు. జై కాంగ్రెస్.. జై సోనియాగాంధీ అంటూ నినాదాలు చేశారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా డౌన్ డౌన్ మోదీ అంటూ నినదించారు కాంగ్రెస్ నేతలు. మణిపూర్ అంశంపై మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు నేతలు. 

కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా.. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వినతిపత్రం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని కేంద్రానికి తెలియజేయాలని కోరారు. రోడ్డుపై బైఠాయించిన వారిలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఇతరులు పాల్గొన్నారు.