పాలమూరు జిల్లా నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

ఉమ్మడి మహబూబ్‪నగర్ జిల్లా నేతలంతా కలిసికట్టుగా పనిచేసి మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాలు గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్సీ అభ్యర్థులతో పాటు ముఖ్యనేతలతో ఆదివారం (మార్చి 24)న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. దాదాపు  రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై నేతలతో చర్చించారు. లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్ధేశం చేశారు. పోలింగ్ బూత్ ల వారీగా నేతలు బాధ్యతలు తీసుకుని సమన్వయంతో పనిచేయాలన్నారు. 

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం చొరవను ప్రజలకు వివరించాలన్నారు. వంద రోజుల ప్రజా పాలనలో కాంగ్రెస్ అమలు చేసిన గ్యారంటీలను ప్రజలకు తెలియజేయాలన్నారు. నేతలంతా సమన్వయంతో పనిచేసి ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలతో పాటు ఎమ్మెల్సీని గెలిపించుకోవాలన్నారు సీఎం. ఈ సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ లు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.