సంక్రాంతి తర్వాత రైతు భరోసా .. ఈ అసెంబ్లీ సమావేశాల్లో విధివిధానాలు ఖరారు చేస్తం: సీఎం రేవంత్​

  • ఇందిరమ్మ ప్రభుత్వంగా చెప్తున్నా.. ఇది సోనియమ్మ గ్యారంటీ 
  • వచ్చే సీజన్​లోనూ సన్నాలకు 500 బోనస్ కొనసాగిస్తం 
  • మారీచుల మాటలు నమ్మి మోసపోవద్దు.. రూ.2 లక్షల రుణమాఫీ గ్యారంటీని పూర్తి చేసినం
  • 25.35 లక్షల మంది రైతులకు 20 వేల కోట్లకుపైగా మాఫీ చేసినం
  • గత సర్కారు చేసిన అప్పులకు నెలకు 6,500 కోట్ల మిత్తీలు కడుతున్నం
  • 10 నెలల్లో నెరవేర్చిన హామీలపై చర్చకు వస్తారా? అని బీజేపీకి సవాల్​

హైదరాబాద్, వెలుగు:  సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. ‘ఇందిరమ్మ ప్రభుత్వంగా చెప్తున్నా.. ఇది సోనియమ్మ గ్యారంటీ’  అని పేర్కొన్నారు.   సన్న వడ్లకు క్వింటాల్​కు రూ.500 బోనస్ కొనసాగుతుందని, రాబోయే యాసంగిలోనూ ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ 100 శాతం పూర్తయిందని పేర్కొన్నారు. ఒకటి, అర ఎక్కడైనా మిగిలి ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే.. వాళ్లకు కూడా మాఫీ చేస్తామని చెప్పారు. మారీచుల మాయ మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని కోరారు. 

హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లోని తన​ నివాసంలో సీఎం రేవంత్​ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు. గత కేసీఆర్‌‌ సర్కారు బకాయి పెట్టిన రూ.7,625 కోట్ల రైతు బంధును తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లించామని గుర్తుచేశారు. ‘‘ఆనాడు సీతమ్మను ఏమార్చడానికి బంగారు లేడి రూపంలో వచ్చిన మారీచుడే.. ఈనాడు మారువేషంలో బీఆర్ఎస్, బీజేపీ రూపంలో మీ దగ్గరకు వస్తున్నడు. 

ఈ మారీచులను నమ్మకండి. సంక్రాంతి పండుగ తర్వాత మీ ఖాతాల్లో రైతు భరోసా పడుతుంది. ఇది సోనియమ్మ గ్యారంటీగా నేను చెబుతున్నా” అని అన్నారు.  రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్‌‌ సబ్‌‌ కమిటీ వేశామని,  ఆ కమిటీ ఇచ్చిన నివేదికపై ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే చర్చించి త్వరలో విధివిధానాలు ఖరారు చేస్తామని సీఎం తెలిపారు.  

రూ.2 లక్షల రైతు రుణమాఫీ ఎలా పూర్తి చేశామో.. రైతు భరోసా కూడా అదేవిధంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.సన్నవడ్లు పండిస్తే క్వింటాల్​కు రూ.500 బోనస్​ ఇస్తామని చెప్పామని, ఇప్పుడు ఇచ్చి చూపిస్తున్నామని సీఎం రేవంత్​ తెలిపారు. దీనిపైనా చాలా అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. గత కేసీఆర్​సర్కారు హయాంలో వరేస్తే ఉరి వేసుకున్నట్టే అని మాట్లాడారని,  ఎవరు వరేస్తే వాళ్ల కర్మ అని కేసీఆర్​ స్వయంగా అన్నారని తెలిపారు. కానీ.. నేడు తాము వరి వేసుకుంటే మద్దతు ధర ఇచ్చి కొంటామని చెబుతున్నామని, సన్నాలు పండించిన రైతులకు రూ.500 బోనస్​ఇస్తామని చెప్పి.. ఈరోజు వరకు 31 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యాన్ని సేకరించామని వివరించారు.  

సన్నొడ్లకు రూ.500 బోనస్​ కొనసాగుతుందని, ఒక్కసారి ఇచ్చి వదిలేయబోమని స్పష్టం చేశారు. తెలంగాణ రైతుల నుంచి సన్నవడ్లు కొని వాటిని బియ్యంగా మార్చి.. రేషన్‌ కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. సంక్షేమ గురుకుల హాస్టళ్లలో ఎక్కడెక్కడ భోజన వసతి ఉంటుందో అక్కడ సన్న బియ్యంతో విద్యార్థుల కడుపు నింపాలని ఆలోచన చేస్తున్నామని చెప్పారు.   

వాళ్ల రుణమాఫీ వడ్డీలకే.. 

2018 –2023 వరకు దాదాపు ఐదేండ్ల పూర్తి కాలంలో రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేసి రైతు పక్షపాతిగా  నిరూపించుకున్నామని  సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. ‘‘పార్లమెంట్​ ఎన్నికల సందర్భంగా జరిగిన సవాళ్ల నేపథ్యంలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 కల్లా రుణమాఫీ పూర్తిచేస్తామన్నం. 25 రోజుల్లో రూ.17,869 కోట్ల రూపాయాలను 3 విడతలుగా 22,22,067 మంది రైతులకు ఇచ్చినం. 

దానికి సంబంధించి 18–07–2024 న 11,34,412 మంది రైతులకు రూ.6,034.96 కోట్లు ఫస్ట్​ ఫేజ్​లో రూ.లక్షలోపు ఉన్న పంట రుణాలు మాఫీ చేసినం. ఫేజ్​ –2 లో  2024 జులై 30 నాటికి 6,40,823 మంది రైతులకు రూ.6,190 కోట్లను లక్షన్నర రుణం ఉన్నవాళ్లకు వేసినం. మూడో విడత పంద్రాగస్టు రోజున 4,46,832 మంది రైతులకు రూ.5,644.25 కోట్లు ఇచ్చినం. 3 విడతల్లో రూ.17,869 కోట్లు మాఫీ చేసినం. 

 2024 నవంబర్​30న మహబూబ్​నగర్​ జిల్లాలో చివరి విడతగా రూ.2,747 కోట్లను  గతంలో సాంకేతిక లోపాలు, రేషన్​ కార్డుల్లో గందరగోళం, బ్యాంకులు వివరాలు అందించడంలో  తాత్సారం అయిన 3,13,897 రైతు కుటుంబాలకు రుణమాఫీ కింద జమ చేసినం. మొత్తంగా 25,35,964 రైతు కుటుంబాలకు రూ.20,616.89 కోట్లు పంట రుణమాఫీ కింద జమ చేసినం. రూ.2 లక్షల రుణమాఫీ గ్యారంటీని పూర్తి చేసినం. దేశానికి స్వాత్యంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 29 రాష్ట్రాలు కానీ.. గతంలో పెద్ద రాష్ట్రాలుగా ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయిలో ఏ ప్రభుత్వం మాఫీ చేయలేదు.

ALSO READ | స్టార్టప్: చెత్తతో కొత్తగా.. పేవర్ బ్లాక్స్

 గతంలో మా ప్రభుత్వం ఉన్న కూడా ఇంత పెద్ద ఎత్తున చేయలేదు. ఇది దేశంలోనే రికార్డు” అని వివరించారు. అయినా.. బీఆర్ఎస్​ నాయకులు  పదే పదే రుణమాఫీ గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  2014లో రుణమాఫీ చేస్తామని బీఆర్ఎస్​ పార్టీ హామీ ఇచ్చినా.. మొదటి విడత సరిగా చేయలేదన్నారు.  2018 ఎన్నికల్లో కూడా మళ్లీ రూ.లక్ష ఏక మొత్తంలో మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారని,  చివరకు మళ్లీ ఎన్నికలు సమీపించిన సమయంలో ఔటర్​ రింగ్ రోడ్డు అమ్మి  21,35,557 మంది రైతులకు 11,909.31 కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని అన్నారు. నాలుగున్నరేండ్ల తర్వాత రుణమాఫీ చేయడంతో రూ.లక్ష పంట రుణం తెచ్చుకున్నోళ్లకు వడ్డీలకే రూ.8,578 కోట్లు పోయాయని తెలిపారు. కేవలం రూ.3,331 కోట్లు మాత్రమే అసలు కింద జమ అయిందని వివరించారు. ఇది రైతులు గమనించాలని కోరారు. 

7 లక్షల కోట్ల అప్పు ఉన్నా సంక్షేమం చేస్తున్నం

కేసీఆర్​ తమకు రూ.7లక్షల కోట్ల అప్పుతో  ప్రభుత్వాన్ని అప్పగించారని సీఎం రేవంత్​ తెలిపారు. ‘‘ ప్రభుత్వం ఇంత అప్పుల్లో ఉందని కేసీఆర్‌, హరీశ్‌రావు, ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌, అధికారులు ఎవరూ చెప్పలేదు. మే అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ఆస్తులు,-అప్పులపై శ్వేతపత్రం విడుదల చేశాం. గత బీఆర్ఎస్​ ప్రభుత్వం చేసిన అప్పులపై  ప్రతి నెలా రూ.6,500 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నం. 

భారీగా ఉన్న అప్పు చూసి కూడా అధైర్యపడకుండా పాలన సాగిస్తున్నం” అని తెలిపారు. రైతు సంక్షేమంతో.. నెహ్రూ దగ్గర నుంచి మొదలుపెడితే డాక్టర్​ వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి ఉమ్మడి సీఎంగా బాధ్యత చేపట్టి ఇచ్చిన ఉచిత కరెంట్​ వరకు రైతులే తమ ఎజెండాగా ఉన్నారని చెప్పారు.  రాజ్యం చేపట్టే వారి తలరాతనే రైతులు మారుస్తారని తాము నమ్మామని, అందుకే ఆదినుంచీ రైతులను ఆదుకునే కార్యక్రమాలను కాంగ్రెస్​ పార్టీ చేపట్టిందని తెలిపారు.  

కిషన్​రెడ్డికి తెలంగాణతో ఏం సంబంధం?

బీజేపీ విడుదల చేసిన చార్ట్​షీట్​లో కేసీఆర్​ పాలన మాదిరే రేవంత్​ రెడ్డి పాలన ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్​ స్పందించారు.‘‘ గుజరాత్​లో మద్యం నిషేధం ఉందని వాళ్లు చెబుతున్నారు. బస్సు పెట్టి అక్కడ ఏమేం బ్రాండ్లు దొరుకుతాయో వెళ్లి చూసొద్దాం.  తెలంగాణ గురించి ప్రశ్నించేందుకు కిషన్​ రెడ్డికి ఏం సంబంధం ఉంది” అని ప్రశ్నించారు.  కిషన్​రెడ్డి గుజరాత్ కు బానిస అని, అందుకే ఆయన గుజరాత్ వెళ్తున్నానని మొన్ననే చెప్పారని అన్నారు.

 ‘‘2014, 2019, 2023  ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలు, మేనిఫెస్టో తీసుకుని మా మంత్రులు వస్తరు. మీ తరఫున ఎవరు వస్తారో చెప్పండి. 11 ఏండ్ల మోదీ హామీలు.. 10 నెలల్లో మా హామీల మీద ప్రత్యేక చర్చ పెట్టుకుందాం. మాకు ఏం ఇబ్బంది లేదు” అని సవాల్​ చేశారు.  సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్​ రావు, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్​, యెన్నం శ్రీనివాస్​ రెడ్డి, కుంభం అనిల్​ కుమార్​ రెడ్డి, మందుల సామేలు, సీఎం సలహాదారు వేం నరేందర్​ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణంపై సీఎం సమీక్ష

గోషామహల్ స్టేడియంలో నిర్మించబోయే ఉస్మానియా ఆసుపత్రిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. ఆస్పత్రి రహదారులపై సీఎం పలు సూచనలు చేశారు. రహదారుల నిర్మాణం కోసం తక్షణమే సర్వే ప్రారంభించాలని ఆదేశించారు. ఆస్పత్రికి కావాల్సిన మౌలిక సదుపాయాలు తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ కోసం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అన్నీ శాఖలతో సమన్వయం కోసం నోడల్ ఆఫీసర్​గా సీనియర్ ఐఏఎస్ అధికారి దాన కిషోర్​ను నియమించారు. 

నేడు కోకాకోలా గ్రీన్ ప్లాంట్ ప్రారంభం

రాష్ట్రంలో కోకాకోలా భారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నది. కూల్ డ్రింక్స్‌ను ఉత్పత్తి చేసే హిందూస్థాన్ కోకాకోలా బేవరేజెస్ సంస్థ.. బండ తిమ్మాపూర్‌లోని ఫుడ్ పార్క్‌లో భారీ బాట్లింగ్ ప్లాంట్‌ను  ఏర్పాటు చేస్తున్నది‌. ఈ గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్‌ను సోమవారం సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించనున్నారు. ఈ ప్లాంట్ నిర్మాణం ఇటీవలే పూర్తి కాగా.. అతి త్వరలోనే కార్యకలాపాలను ప్రారంభించనుంది. పూర్తి సామర్థ్యంతో అందుబాటులోకి వచ్చే నాటికి ఈ ప్లాంట్ లో కొత్తగా 400 మందికి ఉపాధి లభించనుంది.‌