చెంచు మహిళపై దారుణం..పది రోజులు నిర్బంధించి చిత్రహింసలు

  •     పచ్చికారం రాసి, డీజిల్ పోసి నిప్పంటించి ఘాతుకం 
  •     నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కర్నూల్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ఘటన
  •     నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి ఆదేశం 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ చెంచు మహిళను పది రోజులుగా నిర్బంధించి, కొట్టి, మర్మాంగాలపై పచ్చిమిరపకాయల రసాన్ని రుద్ది, చిత్రహింసలకు గురి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామానికి చెందిన కాట్రాజు ఈదన్న, ఈశ్వరమ్మ(30) దంపతులు అదే గ్రామానికి చెందిన బండి వెంకటేశ్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఇసుక ఫిల్టర్ పరిశ్రమ దగ్గర కూలీలుగా పని చేస్తున్నారు. ఈశ్వరమ్మ అక్క బావలు కూడా అక్కడే దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. చాలాకాలంగా అక్కడే వెట్టి చాకిరి చేయించుకుంటూ తిండికి, హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ ఖర్చులకూ వెంకటేశ్‌‌‌‌‌‌‌‌ సరిగా డబ్బులు ఇవ్వడం లేదు. దీంతో ఈశ్వరమ్మ అతని వద్ద పని మానేసింది. తన ముగ్గురు పిల్లలను పోషించుకోవడానికి వేరే చోట పని చూసుకోవాలని భావించింది. 

దీంతో కోపంతో రగిలిపోయిన వెంకటేశ్, అతని భార్య శివమ్మ, తమ్ముడు శివుడు కలిసి ఈశ్వరమ్మపై దాడి చేశారు. దాదాపు 10 రోజులు వారింట్లోనే నిర్భంధించి చిత్రహింసలకు గురి చేశారు. చేతులు, కాళ్లు కట్టేసి పచ్చి మిరపకాయల రసాన్ని మర్మాంగాలపై రుద్దారు. ఒంటిపై డీజిల్ పోసి నిప్పంటించారు. దీంతో ఈశ్వరమ్మ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని ఈశ్వరమ్మ అక్కా బావలను బెదిరించారు. భార్య కనిపించకపోవడంతో పుట్టింటికి వెళ్లి ఉంటుందని భర్త ఈదన్న భావించాడు. ఆమె పుట్టింటికి కూడా వెళ్లలేదని తెలిసి.. రెండ్రోజుల కింద స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు విచారించిన పోలీసులు ఈశ్వరమ్మ వెంకటేశ్‌‌‌‌‌‌‌‌ ఇంట్లో ఉందని తెలుసుకొని, అక్కడి వెళ్లి బుధవారం రాత్రి ఆమెను కాపాడారు. తీవ్రంగా గాయపడిన ఆమెను నాగర్ కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. అనంతరం వెంకటేశ్‌‌‌‌‌‌‌‌తో పాటు అతని భార్య, తమ్ముడిని కూడా పోలీసులు అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. 

మంత్రి జూప‌‌‌‌‌‌‌‌ల్లి సీరియస్.. 

చెంచు మ‌‌‌‌‌‌‌‌హిళ‌‌‌‌‌‌‌‌పై జరిగిన దాడిపై మంత్రి జూప‌‌‌‌‌‌‌‌ల్లి కృష్ణారావు సీరియస్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. ఇలాంటి పాశవిక దాడులకు ఎవరూ పాల్పడిన ఉపేక్షించబోమని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ వైభ‌‌‌‌‌‌‌‌వ్ గైక్వాడ్‌‌‌‌‌‌‌‌ను మంత్రి ఆదేశించారు. ఫోన్ చేసి కేసు ద‌‌‌‌‌‌‌‌ర్యాప్తు పురోగ‌‌‌‌‌‌‌‌తిపై ఆరా తీశారు. ఇలాంటి ఘటనలు పున‌‌‌‌‌‌‌‌రావృతం కాకుండా చర్యలు తీసుకోవాల‌‌‌‌‌‌‌‌న్నారు. చెంచు, ఆదివాసీ, గిరిజన సంఘాలు, ప్రజా సంఘాల నేతలు ఈ ఘటనను ఖండించారు.