సంస్కరణలకు నాంది పలకనున్న కుల సర్వే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సమగ్ర కుల సర్వే చేయడానికి నడుం బిగించింది.  గత ప్రభుత్వాలు చేయని చరిత్రలో నిలిచి పోదగిన చారిత్రాత్మక ఘట్టానికి ప్రభుత్వం  దృఢ సంకల్పంతో  అడుగు ముందుకు వేసింది. ఇంటి ఇంటికి వెళ్లి అన్ని కులాలను  సర్వే చేసి సమగ్ర సమాచారాన్ని సేకరించడానికి  సిద్ధపడిన  ప్రభుత్వ నిర్ణయాన్ని    స్వాగతించ వలసిన అవసరం ఉంది.  ఈ సర్వే రాష్ట్రంలో  కొత్త చరిత్ర నిర్మాణానికి నాంది పలక బోతుంది. కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలని అనేక సమావేశాలలోను, వివిధ సందర్భాలలో మాట్లాడుతున్నారు. అంతేకాకుండా సామాజిక న్యాయం గురించి,  రాజ్యాంగ వాదం గురించి బలంగా తన  గొంతుకను వివిధ  వేదికల పైన వినిపిస్తున్నారు.  కుల సర్వే  తెలంగాణ పౌర సమాజం సాధించిన గొప్ప విజయంగా  భావించాలి. పౌర సమాజం చైతన్యవంతంగా ఉంటే, తాము అనుకున్నది ప్రభుత్వం చేత చేయించుకోవచ్చు అని చెప్పడానికి ఇది ఉదాహరణ.

రాష్ట్రంలో బలపడిన సామాజిక న్యాయ ఉద్యమం

తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడు లేని విధంగా సామాజిక న్యాయ ఉద్యమం బలపడింది. కొద్ది నెలల సమయంలోనే రాష్ట్రంలో  వందలాది  సామాజిక న్యాయ సదస్సులు, సమావేశాలు, ధర్నాలు నిర్వహించబడ్డాయి.    సామాజిక న్యాయ పోరాట ఉద్యమమే.   విద్యావంతులు, మేధావులు, కుల సంఘాలు మరియు ప్రజా సంఘాలు సామాజిక న్యాయపోరాటం ఉధృతం చేయడమే కాకుండా సాధారణ ప్రజలను సామాజిక  న్యాయ ఉద్యమాల వైపు ఆకర్షితులను చేయడంలో విజయం సాధించగలిగారు.  కుల గణన చేయడం ద్వారానే తమకు న్యాయం  జరుగుతుందని, పెద్ద ఎత్తున తమ జీవితాలలో మార్పు రాబోతున్న భావనలోకి మెజార్టీ  ప్రజలను తీసుకురాగలిగారు.  రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చేటట్లు చేయడంలో   చివరకు పౌర సమాజం విజయం సాధించగలిగింది.

స్థితిగతులు తెలియాలి

రాష్ట్రంలో కుల సర్వేతో ఏ కులంవారు ఎంత సంఖ్య ఉన్నారు తెలుసుకోవడం ఒకటే ప్రధానం  కాదు.   కుల సర్వే వలన అనేక రకాల అంశాలు వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది. సర్వేతో వివిధ కులాల వారీగా వారి ఆర్థిక, రాజకీయ, విద్యా ఉద్యోగ, ఉపాధి, అవకాశాలతోపాటు స్త్రీ పురుష  
నిష్పత్తి వారు ఉపయోగించే వాహనాలు, సాంకేతిక పరిజ్ఞానం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాల వల్ల పొందిన ప్రయోజనాలు, రిజర్వేషన్ల వల్ల పొందిన ఫలితాలు, విద్యా సదుపాయాలు, వారి విద్యా అర్హతలు, జీవన ప్రమాణాలతో పాటు, ఇంకా ఏమేరకు ప్రభుత్వ సహకారం అందుతుందో తదితర సమాచారం సేకరించడం జరుగుతుంది.   ఇది భవిష్యత్తులో ప్రభుత్వాలకి తగిన విధంగా ప్రణాళికలను, విధానాలను రూపొందించుకుని  అమలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగడానికి  ఎంతగానో దోహదం  చేస్తుంది.

సమన్యాయం జరగాలి

నిజమైన సంపూర్ణ సామాజిక సంస్కరణ నేటికీ  జరగలేదన్న సత్యాన్ని మనం అందరం అంగీకరించాలి. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత  ఆర్థిక, రాజకీయ, విద్య,  ఉపాధి, రంగాలలో సంస్కరణలు జరిగినప్పటికీ వాటి ఫలాలు కొన్ని పరిమిత  సామాజిక వర్గాలే పొందాయి. వాటి ఫలాలు అన్ని సామాజిక వర్గాల కి నేటికీ అందుబాటులోకి రాలేదు.  సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్య, ఉపాధి పరంగా కొన్ని కులాలు వెనకబడిపోవడానికి కులమే ప్రధాన కారణం అన్న విషయం ఈ సర్వేతో బహిర్గతం కానుంది. సంపూర్ణ సామాజిక సంస్కరణ దిశగా అడుగులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కుల సర్వే బలమైన పునాది వేస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు.

- నాగుల వేణు యాదవ్
అసిస్టెంట్ ప్రొఫెసర్