రైతు భరోసా విధివిధానాలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. చర్చించిన అంశాలు ఇవే..!

సంక్రాంతి కానుకగా రైతు భరోసా అందించాలని లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఆదివారం (29 డిసెంబర్2024) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. సెక్రెటేరియట్ లో జరిగిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం తో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో రైతు భరోసా విధివిధానాలపై, అదే విధంగా అర్హులైన రైతులను గుర్తించడంపై చర్చించారు.  విధివిధానలపై మంత్రి వర్గ ఉపసంఘం చర్చించిన అంశాలను కేబినెట్ కు సిఫార్సు చేయనుంది. 

రైతు భరోసా కటాఫ్ ఎంత పెట్టాలనే అంశంపై మంత్రివర్గ చర్చించింది.  అదే విధంగా కౌలు రైతుల అంశంపై చర్చకు వచ్చినట్లు సమాచారం. ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలనే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. కటాఫ్ 5 ఎకరాలు, ఏడున్నర ఎకరాలు, 10 ఎకరాలు.. ఇలా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి.. ఎన్ని ఎకరాలకు సీలింగ్ ఎంత ఉండాలనే అంశంపై చర్చించారు. దీనికి సంబంధించి నాలుగు ముసాయిదాలు సిద్ధం చేసినట్లు సమాచారం. కేబినెట్ సబ్ కమిటీ పంపిన సిఫారసులను పరిగణనలోకి తీసుకొని రైతు భరోసాను కేబినెట్ ఆమోదించిన తర్వాత పథకాన్ని లాంచ్ చేసే అవకాశం ఉంది. 

Also Read : ఓఆర్ఆర్ లీజుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు

అయితే రైతు భరోసా స్కీంను ప్రభుత్వ ఉద్యోగాలు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఇవ్వాలా వద్దా అనే అంశంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. అదేవిధంగా పీఎం కిసాన్ ద్వారా కొన్ని నిబంధనల వలన అప్పట్లో కొందరు  రైతుబంధుకు అనర్హులుగా ఉన్నారు. పీఎం కిసాన్ స్కీం నుండి కొన్ని అంశాలను మినహాయించి ఎలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో చర్చించారు. వీలైనంత ఎక్కువ మందికి పథకం అందేలా చూడాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తే చాలా మంది నష్టపోయే అవకాశం ఉండటం వలన రైతులకు మేలు చేసే విధంగా ఎలాంటి నిబంధనలు తీసుకోవాలో చర్చించారు. 
కొత్త ఏడాది భూమాత, రైతు భరోసా స్కీంలను ప్రారంభించే అవకాశం. 

గత ప్రభుత్వ హయాంలో రాళ్లు, రప్పలకు, నిరుపయోగమైన, సాగుకు ఉపయోగపడని భూములకు రైతుబంధు ఇచ్చారు. ఈసారి అలా కాకుండా సాగు యోగ్యమైన భూములకు మాత్రమే ఇవ్వాలని సబ్ కమిటీ నిర్ణయించింది. ఈ సబ్ కమిటీ పంపే సిఫార్సులను పరిగణనలోకి తీసుకొని కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత ఈ పథకం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సంక్రాంతికి ఎకరాకు రూ.7500 రైతుల అకంట్లో వేసే విధంగా కసరత్తు చేస్తోంది ప్రభుత్వం.