తెలంగాణ బడ్జెట్: పంచాయతీ రాజ్‌కు రూ.29,816 కోట్లు

  • ఆసరా పింఛన్లకు రూ.14 వేల కోట్లకు పైగా నిధులు
  • మహిళా సంఘాలకు రెండు కొత్త స్కీమ్‌ల అమలు
  • బడ్జెట్‌‌లో భారీగా నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. మొత్తం రూ.29,816 కోట్లు కేటాయించగా, ఇందులో మెజారిటీ వాటా ఆసరా పెన్షన్లకు రూ.14,628 కోట్లు ఇచ్చారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కోసం రూ.1,302 కోట్లు కేటాయించారు. అలాగే, మహిళా సంఘాలకు ప్రభుత్వం రెండు కొత్త స్కీమ్‌‌లను తీసుకొచ్చింది. వీటిపై ఎంపీ ఎన్నికలకు ముందే జీవోలు ఇవ్వగా.. తాజా బడ్జెట్‌‌లో నిధులు అలాట్ చేసింది. 

ఇందులో లోన్ బీమా, ప్రమాద బీమా స్కీమ్‌‌లు ఉన్నాయి. మహిళా సంఘ సభ్యురాలు మరణిస్తే రూ.10 లక్షల బీమాతో పాటు రూ.2 లక్షల వరకు రుణం మాఫీ అవుతుంది. వీటికి ఇప్పటికే స్ర్తీనిధి అధికారులు టెండర్లు పిలవగా, సుమారు 7 కంపెనీలు టెండర్లు వేశాయి. త్వరలో వీటిని ఓపెన్ చేసి కంపెనీని ప్రభుత్వం ఫైనల్ చేయనుంది. మహిళా సంఘాలు సొంతగా వ్యాపారం ప్రారంభించేందకు ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా శక్తి క్యాంటిన్లకు రూ.80.39 కోట్లు కేటాయించారు. ఉపాధి హామీ స్కీమ్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్స్ కోసం రూ.73.32 కోట్లు, బీడీ వర్కర్ల కోసం రూ.1,074.66 కోట్లు, సెర్ఫ్ రూ.250 కోట్లు అలాట్‌‌ చేసింది. 

స్థానిక సంస్థలకు భారీ నిధులు..

గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌‌లకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కింద నిధులు కేటాయించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి రూ.1,142.61 కోట్లు, జడ్పీలకు రూ.24.28 కోట్లు, మండల పరిషత్‌‌లకు రూ.68.56 కోట్లు అలాట్‌‌ చేసింది. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి జడ్పీలకు రూ.188.68 కోట్లు, మండల పరిషత్‌‌లకు రూ.188.68 కోట్లు, గ్రామ పంచాయతీలకు రూ.30 కోట్లు కేటాయించారు. మూడు స్థానిక సంస్థలకు ప్రత్యేక నిధి కింద రూ.1,163 కోట్లు కేటాయించారు.