ధరణి తప్పులకు భూ భారతితో చెక్

నాలుగేండ్లుగా రైతులను తిప్పలు పెడుతున్న భూ సమస్యలు, వివాదాలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ‘ధరణి– ఆర్​ఓఆర్ 2020’ చట్టం స్థానంలో ‘తెలంగాణ భూ భారతి ఆర్​ఓఆర్​ 2024’ బిల్లును తీసుకొచ్చింది. రైతులకు ఇబ్బంది లేకుండా  భూ సమస్యలను ఫీల్డ్​ లెవెల్​లో సులువుగా పరిష్కరించడమే కాకుండా.. ప్రభుత్వ భూములను కాపాడడంతోపాటు తప్పులు చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ బిల్లును రూపొందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు ఉన్న చట్టంలో సివిల్​ కోర్టుకు వెళ్లడం తప్పితే అప్పీల్స్​కు అవకాశం లేదు.దీంతో కొత్తగా తెస్తున్న చట్టంలో ఆర్డీవో, కలెక్టర్​ స్థాయిలో అప్పీల్స్​ను ఏర్పాటు చేయడమే కాకుండా.. ల్యాండ్​ ట్రిబునళ్లను కూడా తీసుకురానున్నారు. ఇవే ఫైనల్​ ఆర్డర్స్​ ఇవ్వనున్నాయి

ధరణి తప్పులకు చెక్​

ధరణిలో ఉన్న తప్పులు, లోపాలన్నింటిని భూభారతిలో సవరించారు. బిల్లులో ఉన్న ప్రధానంశాల ప్రకారం.. ఇన్నాళ్లూ ఒక్క పట్టాదారు పేరుకే పరిమితమైన పాస్​బుక్కుల్లో త్వరలో అనుభవదారు కాలమ్ రానుంది. పట్టాదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. గతంలో ధరణి వచ్చిన తర్వాత ఖాస్తులో ఉండి ఇబ్బంది పడిన రైతులకు అనుభదారు/ఖాస్తు కాలమ్​ పెట్టనున్నారు. విస్తీర్ణం మిస్​ అయిందనో.. పేరు తప్పు పడిందనో.. ఇలాంటి ఏదైనా భూసమస్య వస్తే ఇప్పుడున్న 33 మాడ్యుల్స్​లో ఏ మాడ్యుల్​లో అప్లై చేసుకోవాలో తెలియని గందరగోళానికి కూడా కొత్త చట్టంతో చెక్​ పడనుంది.

Also Read :- బంగాళాఖాతంలో బ‌ల‌ప‌డిన అల్పపీడ‌నం

 కేవలం ఆరు మాడ్యుళ్లతోనే ధరణి స్థానంలో భూభారతి రాబోతున్నది. అంతా ఆన్​లైన్ లో జరుగుతున్నప్పటికీ.. 2014కు ముందు రెవెన్యూ రికార్డుల నిర్వహణ, జమాబందీ ఎలా ఉండేదో ఇకపైనా అలాగే కొనసాగించనున్నారు.  పదకొండు కాలమ్స్ తో జమాబందీ, గ్రామ రెవెన్యూ రికా ర్డుల నిర్వహణ చేపట్టనున్నారు. ధరణిలో వివాదాస్పదమైన 18 లక్షల ఎకరాల పార్ట్​ బీ భూములకూ కొత్త చట్టంలో పరిష్కారం చూపించనున్నారు. ప్రస్తుత చట్టం ప్రకారం ధరణి నుంచి భూ భారతి పోర్టల్​లోకి వివరాలు వస్తాయి. అయితే వ్యవసాయ, వ్యవసాయేతర, అబాదీ (గ్రామకంఠం) భూములన్నింటిని డ్రోన్​ లేదా ఇతర సర్వే కార్యక్రమాల తర్వాత ప్రతి భూ కమతాన్ని మ్యాపింగ్​ చేసి భూభారతితో శాశ్వాతంగా భూధార్​ నంబర్​ను కేటాయిస్తారు.