బీఆర్ఎస్ ఆందోళనల మధ్యే అసెంబ్లీలో కీలక బిల్లుల ఆమోదం

తెలంగాణ శాసన సభలో పలు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ వర్సిటీ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తెలంగాణ స్పోర్ట్స్ వర్సిటీ బిల్లును మంత్రి కొండా సురేఖ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు.  బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్య ఎలాంటి చర్చ బిల్లులకు ఆమోదం తెలిపింది.

అదే విధంగా విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. వీటితో పాటు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం లభించింది. టూరిజంపై శాసన సభలో చర్చ జరుగుతుండగా బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు.  సభ్యుల ఆందోళనల మధ్య వివిధ బిల్లులకు ఆమోదం తెలిపింది.

స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం
రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దానికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అని పేరు పెట్టారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్న ఫ్యూచర్ సిటీ (ఫోర్త్ సిటీ)లో నిర్మించే స్పోర్ట్స్ హబ్కు సపోర్ట్గా స్పోర్ట్స్​యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. కొత్తగా ఏర్పాటు చేసే క్యాంపస్లో ఒలింపిక్స్ స్థాయి ప్రమాణాలతో సౌలతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

స్పోర్ట్స్ యూనివర్సిటీలో దాదాపు 13 కోర్సులు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. అంతర్జాతీయ స్థాయిలో సౌలతులు కల్పిస్తారు. అలాగే స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయనున్నారు.

గచ్చిబౌలి స్పోర్ట్స్ స్టేడియం ప్రాంగణంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ యూనివర్సిటీని యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీగా తీర్చిదిద్దాలని అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తరహాలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీని పీపీపీ మోడల్లో నిర్వహించాలని సీఎం డిసైడ్ కావడం గమనార్హం.

క్రికెట్, హాకీ, ఫుట్​బాల్, బాస్కెట్ బాల్, స్విమ్మింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, షూటింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, అక్వాటిక్స్ లాంటి 14 క్రీడలను స్పోర్ట్స్ హబ్లో పొందుపరిచారు. దాదాపు 7‌‌‌‌0 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గచ్చిబౌలి స్పోర్ట్స్​ స్టేడియంలో ఇప్పటికే వివిధ క్రీడలకు రెడీమేడ్ సదుపాయాలు ఉన్నందున.. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు వాటిని అప్ గ్రేడ్ చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

ALSO READ | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బేడీలు వేసుకున్నారు తప్ప కేటీఆర్, హరీష్ బేడీలు వేసుకోలే: మంత్రి సీతక్క

సీఎం రేవంత్ రెడ్డి సౌత్ కొరియాలో పర్యటించిన సందర్భంలో అక్కడ కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని ఆయన సందర్శించారు. ఇది ప్రపంచంలోనే పేరొందిన స్పోర్ట్స్ యూనివర్సిటీ. ఇటీవల పారిస్​లో జరిగిన ఒలింపిక్స్‌‌‌‌లో సౌత్ కొరియా మొత్తం 32 పతకాలు గెలుచుకోగా, అందులో 16 పతకాలు కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందిన అథ్లెట్లు సాధించినవే ఉన్నాయి. ఈ వర్సిటీలో శిక్షణ పొంది, పారిస్ ఒలింపిక్స్‌‌‌‌లో ఆర్చరీ విభాగంలో మూడు బంగారు పతకాలు సాధించిన అథ్లెట్ లిమ్ సి-హైయోన్‌‌‌‌ను సీఎం రేవంత్ రెడ్డి తన పర్యటనలో కలిసి అభినందించారు.

భవిష్యత్ ఒలింపిక్స్​చాంపియన్లకు శిక్షణ ఇచ్చేలా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి సాంకేతిక భాగస్వాములుగా కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ సేవలు వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా మంగళవారం తెలంగాణ శాసన సభలో స్పోర్ట్స్ వర్సిటీ బిల్లును ప్రవేశ పెట్టారు. విపక్ష సభ్యుల ఆందోళన నడుమ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం లభించింది.