డిసెంబర్ 30న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం .. మన్మోహన్​కు నివాళి అర్పించనున్న సభ

  • అదే రోజు జరగాల్సిన కేబినెట్ మీటింగ్ వాయిదా?  

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 30న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌‌‌‌ మృతికి సభ సంతాపం తెలిపి, ఆయనకు నివాళులు అర్పించనుంది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమవుతుందని అందులో పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ ఏర్పాటైంది. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే రాష్ట్రానికి మెట్రో, ఓఆర్ఆర్ వచ్చాయి. కాగా, ఈ నెల 30న జరగాల్సిన కేబినెట్ మీటింగ్ ను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. 

30న సెక్రటేరియెట్ లో సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ఉంటుందని ఇటీవల సీఎస్ శాంతికుమారి మెమో జారీ చేశారు. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో సంతాప దినాలు ప్రకటించిన కారణంగా కేబినేట్​సమావేశం వాయిదా వేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. సంతాప దినాలు ముగిసిన తర్వాత కేబినెట్ సమావేశం నిర్వహించాలని సర్కార్ భావిస్తున్నది. మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో రాష్ట్రంలో ఏడు రోజులు సంతాప దినాలను ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వచ్చే నెల 2 లేదా ఆ తర్వాత కేబినెట్ భేటీ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.