భూ భారతి బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం


తెలంగాణ అసెంబ్లీలో భూభారతి బిల్లు - 2024  ఆమోదం పొందింది.  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  బిల్లును  ప్రవేశపెట్టారు. భూ భారతి బిల్లు ప్రవేశ పెట్టే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు పొంగులేటి.  బిల్లు ఆమోదం పొందుతుండటంతో   ఆనంద భాష్పాలు వస్తున్నాయన్నారు. సభలో భూ భారతి బిల్లు ప్రవేశ పెట్టిన మంత్రి..బిల్లును పాస్ చేయాల్సిందిగా స్పీకర్ ను కోరారు. సభ్యులు  ఆమోదిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం అసెంబ్లీని డిసెంబర్ 21 శనివారానికి వాయిదా వేశారు స్పీకర్.

 అంతకు మందు భూ భారతి బిల్లుపై చర్చ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ సర్కార్ ను తూర్పారబట్టారు. ధరణి పోర్టల్  కేసీఆర్ తీసుకొచ్చింది కాదని..2010లో ఒడిశాలో ఈ ధరణి  తీసుకొచ్చారని  అన్నారు .  ధరణిలో లోపాలున్నాయని కాగ్ తేల్చిందన్నారు.  అర్హత లేని కంపెనీకి ధరణిని  అప్పగించారని 2014లోనే కాగ్ తప్పుబట్టిందన్నారు. కాగ్ తప్పుబట్టిన ధరణిని కేసీఆర్ తెలంగాణలో ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు.  

ధరణి చట్టాన్ని రిప్లేస్ చేస్తూ కొత్త చట్టం తెస్తున్నామన్నారు సీఎం రేవంత్.  కొత్త చట్టం ద్వారా కోటి 52 లక్షల ఎకరాల భూముల వివరాలను భద్రపరుస్తామని చెప్పారు.  ప్రతి భూ యజమాని హక్కులను కాపాడుతామన్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రూల్స్ ఉల్లంఘించిందన్నారు. చర్చను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ కుట్ర చేసిందన్నారు.