కృష్ణా నీటి పంపకాలపై ఏపీ తొండాట.. విచారణను ఆలస్యం చేసేందుకు అడ్డగోలు వాదనలు

  • ఏపీ రిప్లైకి ట్రిబ్యునల్​లో తెలంగాణ రిజాయిండర్​
  • ప్రాజెక్టులవారీగా కేటాయింపులపై విచారిస్తే మరింత జల దోపిడీకి అవకాశం
  • త్వరగా విచారణ పూర్తి చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: కృష్ణా నీటి కేటాయింపులపై కేసును ఏపీ దురుద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నదని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్​ 89లోని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ప్రకారం ప్రాజెక్టులవారీగా కేటాయింపులు, ప్రాజెక్టుల ఆపరేషనల్ ప్రొటోకాల్​తోపాటు కేంద్రం సూచించిన అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం  సెక్షన్ 3లోని ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ప్రకారం కృష్ణా, గోదావరి బేసిన్లలో ఎన్​బ్లాక్​ కేటాయింపుల ఆధారంగానే నీటి పంపకాలపై కలిపి విచారణ చేయాలని కోరింది. రెండు అంశాలను వేర్వేరుగా విచారణ జరపాలన్న ఏపీ వాదన అర్థరహితమని, కేసు పూర్తి కావొచ్చిన సందర్భంలో విపరీతమైన జాప్యం చేసేందుకే కొత్త మెలిక పెట్టిందని ఆక్షేపించింది.

ఈ మేరకు కృష్ణా వాటర్​ డిస్ప్యూట్స్​ ట్రిబ్యునల్​ 2 (కేడబ్ల్యూడీటీ 2/బ్రజేశ్​కుమార్​ ట్రిబ్యునల్​) ముందు.. ఏపీ దాఖలు చేసిన రిప్లై అఫిడవిట్​కు తెలంగాణ ఇరిగేషన్​ అధికారులు తాజాగా రిజాయిండర్​దాఖలు చేశారు. రెండింటినీ వేర్వేరుగా విచారిస్తే అనవసరంగా సమయం వృథా అవుతుందని రిజాయిండర్​లో అధికారులు పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాలను సమానంగా పంచనంత వరకు ప్రాజెక్టులవారీగా నీటి పంపకాలు చేసినా, ఆపరేషనల్​ ప్రొటోకాల్​ను నిర్ధారించినా వ్యర్థమేనని వాదించారు. ఈ నేపథ్యంలోనే ఆ రెండు అంశాలనూ కలిపే విచారించాలని, జల వివాదాన్ని త్వరగా ముగించి, రెండు రాష్ట్రాలకూ న్యాయం చేయాలని తెలంగాణ అధికారులు విజ్ఞప్తి చేశారు.  

సుప్రీంకోర్టు తిరస్కరించింది 

నీటి కేటాయింపులకు సంబంధించిన అంశంపై ఏపీ సుప్రీంకోర్టుకు వెళ్లిందని, వీలైనంత త్వరగా విచారణ జరపాలని కోరగా సుప్రీంకోర్టు తిరస్కరించిందని తెలంగాణ అధికారులు రిజాయిండర్​లో పేర్కొన్నారు. జనవరి 16, 17వ తేదీల్లో నీటి కేటాయింపులపై ట్రిబ్యునల్​లో విచారణ ఉన్నందున.. అంతకుముందే విచారణ చేపట్టలేమంటూ స్పష్టం చేసిందన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సమాన వాటా పంపకాల అంశం ట్రిబ్యునల్​ ముందు పదేండ్లుగా పెండింగ్​లో ఉందని, దీంతో రాష్ట్రానికి తక్కువ నీటి కేటాయింపులు జరుగుతుండడం వల్ల నష్టపోవాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి అఫిడవిట్లు, అదనపు డాక్యుమెంట్లనూ సమర్పించామని చెప్పారు. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల డీపీఆర్​లనూ సమర్పించామన్నారు. 42 మేజర్, మీడియం ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్​లను ఇప్పటికే అందజేశామన్నారు.

72 శాతం తోడుతున్నది 

రెండు అంశాలను వేర్వేరుగా విచారించాల్సి వస్తే తొలుత సెక్షన్​ 3లోని ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్​ను విచారించాలని తెలంగాణ అధికారులు కోరారు. సెక్షన్​ 89లోని అంశాలతో పోలిస్తే సెక్షన్ 3 అంశాలకే ప్రాధాన్యత ఎక్కువగా ఉందని, అందుకే దీనిపై తొలుత విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి రెండు రాష్ట్రాల మధ్య 66:34 నిష్పత్తిలో నీటి కేటాయింపులు చేశారని, కానీ, ఇదే అదునుగా భావించిన ఏపీ 72 శాతం కన్నా ఎక్కువ నీటిని తీసుకెళ్లిపోతున్నదని పేర్కొన్నారు. ఒక్క శ్రీశైలం నుంచే 200 కుపైగా టీఎంసీలను తరలించుకుపోతున్నదని అభ్యంతరం తెలిపారు. 

ఒకవేళ సెక్షన్​ 89లోని అంశాలపై తొలుత విచారణ జరిపితే.. దానిని ఏపీ అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. తద్వారా కృష్ణా బోర్డు ముందు అయాచిత లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తున్నదని చెప్పారు. నీటి కేటాయింపులకు సంబంధించి అపెక్స్​ కౌన్సిల్​లో చర్చించేది లేదని ఇప్పటికే కేంద్రం తేల్చి చెప్పిందని, ఏదున్నా కేఆర్ఎంబీ ముందే తేల్చుకోవాలని చెప్పిందని గుర్తు చేశారు. కొన్నేండ్లుగా ఏపీ అక్రమ ప్రాజెక్టులను నిర్మిస్తూ నీటిని దొంగదారిలో తీసుకెళ్తున్నదని, అందుకే సెక్షన్​ 89లోని అంశాలను ముందుగా విచారించాలంటూ పేచీ పెడుతున్నదని రిజాయిండర్​లో పేర్కొన్నారు. ఎన్​బ్లాక్​ కేటాయింపుల్లో సమాన వాటాలను పంచిన తర్వాతే ప్రాజెక్టులవారీగా కేటాయింపులను చేపడితే న్యాయం జరుగుతుందన్నారు.