పాట్నా: నితీశ్ కుమార్ కొత్త కూటమి కట్టడంపై ఆర్జేడీ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఆదివారం స్పందించారు. ఈ ఏడాదితో జేడీయూ కథ ముగుస్తుందన్నారు. అసలు ఆట ఇప్పుడే మొదలైందన్నారు. ప్రజలంతా తమ పార్టీ వెంటే ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో జేడీయూ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని చెప్పారు. ‘‘ఆట ఇప్పుడే మొదలైంది. ఇంకా జరగాల్సింది చాలా ఉంది. 2024లో జేడీయూ కథ ముగుస్తుందని రాసిస్తా”అని తేజస్వీ అన్నారు. నితీశ్‌పై తమకెలాంటి కోపం, ద్వేషంలేదని, ఆయనను గౌరవిస్తూనే ఉంటామని చెప్పారు. అయితే, గొప్ప లక్ష్యాలతో రాష్ట్రంలో మహాఘట్బంధన్ కూటమి సర్కారును ఏర్పాటు చేశామని, ఆ ప్రభుత్వాన్ని చంపేసి పోయిన నితీశ్‌కు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు.
