గుడ్డం దొడ్డి పంప్ హౌస్ లో సాంకేతిక లోపం

  •  నెట్టెంపాడు లిఫ్టుకు నిలిచిన నీటి లిఫ్టింగ్

గద్వాల, వెలుగు: గుడ్డం దొడ్డి పంప్ హౌస్ దగ్గర మంగళవారం సాంకేతిక సమస్య తలెత్తడంతో నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ కు నీటి లిఫ్టింగ్ నిలిచిపోయింది. ధరూర్ మండల పరిధిలోని గుడ్డం దొడ్డి గ్రామం దగ్గర నెట్టెంపాడు లిఫ్టులో భాగంగా గుడ్డం దొడ్డి  పంప్ హౌస్ ను నిర్మించి జూరాల బ్యాక్ వాటర్ నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. మంగళవారం రిజర్వాయర్ దగ్గర ప్యానల్ బోర్డు లోని సర్క్యూట్ స్టాటికల్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ (ఎస్ ఎఫ్ సి) కాలిపోవడంతో నీటి ఎత్తిపోతకు ఆటంకం ఏర్పడింది. 

ప్రతిరోజు ఇక్కడ రెండు మోటార్లను ఆన్ చేసి 1500 క్యూసెక్కుల నీటిని నెట్టెంపాటి కు నీటిని ఎత్తిపోస్తుండేవారు.  ఉదయం  సాంకేతిక సమస్య రావడంతో నీటి ఎత్తిపోతల మోటార్లు ఆగిపోయాయి. హైదరాబాదు నుంచి బీహెచ్ ఈ ఎల్ కంపెనీ ప్రతినిధులు వచ్చి సమస్యను పరిష్కరిస్తే తప్ప మళ్ళీ నీటిని ఎత్తిపోయే అవకాశాలు లేనట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. రెండు, మూడు రోజులు నీటి లిఫ్టింగ్ ఆగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

మెయింటెనెన్స్ కి డబ్బులు ఇవ్వడం లేదు

నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలోని మోటార్లు, ప్యానెల్ బోర్డుల నిర్వహణ హైదరాబాదులోని  బీహెచ్ఇఎల్ కంపెనీ నిర్వహిస్తుందని ఇప్పటివరకు మెయింటినెన్స్ కింద 1. 13 కోట్లు పెండింగ్ లో ఉన్నదని అవి ఇచ్చేవరకు తాము ప్యానెల్ బోర్డు రిపేర్లు చేసేది లేదని బీహెచ్ఈఎల్ కంపెనీ చెప్పినట్లు తెలుస్తున్నది.   స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ తో మాట్లాడి పెండింగ్ బిల్లును చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని, నీటి ఎత్తిపోతల కు ఎలాంటి ఆటంకం కలగకుండా, రైతులకు ఇబ్బంది జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని నెట్టెంపాడు ఈ ఈ రహీముద్దీన్ తెలిపారు.