స్టార్టప్ : పాలతో నెరవేరిన కల

చిన్నప్పటినుంచి కష్టపడి చదివాడు. లైఫ్​లో బాగా సెటిల్ కావాలని కలలు కన్నాడు. అనుకున్నట్టుగానే బెంగళూరులోని ఒక పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించాడు. సరిపడా జీతం వస్తున్నా.. ఏదో తెలియని అసంతృప్తి. చుట్టూ కాంక్రీట్ బంగ్లాలు, ఉదయం నిద్ర లేచిన దగ్గర్నించి ఉరుకులు, పరుగుల జీవితం అతనికి నచ్చలేదు. దాంతో ఉద్యోగం మానేసి ఇంటికెళ్లాడు. అప్పటివరకు అతన్ని గౌరవించిన వాళ్లే.. ఇంటికి వెళ్లినప్పటి నుంచి హేళన చేశారు. అంతెందుకు ఫెయిల్యూర్​కి ఎగ్జాంపుల్​గా అతన్ని చూపించేవాళ్లు. కానీ.. అతను వాటన్నింటినీ పట్టించుకోలేదు. పట్టుదలతో ఒక స్టార్టప్​ పెట్టాడు. కష్టనష్టాలకు ఎదురొడ్డి కొన్నాళ్లకు సక్సెస్​ సాధించాడు. ఇప్పుడు అతనే మరో 500 మందికి పని ఇస్తూ.. ‘శెభాష్’​ అనిపించుకున్నాడు. 

రోజూ ఆఫీస్​కు వెళ్లి పనిచేస్తుంటే హరిఓమ్ నౌటియాల్​కు ఏదో భారం మోస్తున్నట్టు ఉండేది. తాను అనుకున్న జీవితం​ అది కాదని అర్థమైంది. డెహ్రాడూన్​కు దగ్గర్లోని బర్కోట్​ అనే చిన్న పల్లెటూళ్లో పెరిగిన హరిఓమ్​కి తన ఊరిని​ మిస్ అవుతున్నాననే ఫీలింగ్​ కలిగింది. ఆఫీస్​లో ర్యాట్​రేస్​, డెడ్​లైన్స్​ నచ్చలేదు. పైగా.. రెసిషన్​ వచ్చినప్పుడు ఉద్యోగం కోల్పోతాననే భయం వెంటాడేది. అందుకే సిటీలో ఉన్నన్ని రోజులు భయంతో బతికాడు. దాంతో ఉద్యోగం వదిలేయాలనే నిర్ణయానికి వచ్చాడు. 

ఉద్యోగంలో.. 

హరిఓమ్​ 2009 రెసిషన్​ టైంలో వెబ్ డెవలపర్‌‌గా ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టాడు. ఉద్యోగం రాగానే ఎగిరి గంతేశాడు. ఆనందానికి అవధుల్లేవు. కానీ.. కొన్నాళ్లకు అంతా తారుమారైంది. సిటీ లైఫ్​కి అలవాటు పడలేకపోయాడు. “సిటీలో ఉన్నప్పుడు 3బీహెచ్​కే ఫ్లాట్​ కొన్నా. లగ్జరీగా  బతికా. కానీ.. జీవితాన్ని ఎంజాయ్​ చేయలేకపోయా. అందుకే ఇంటికి వెళ్లిపోవాలని బలంగా కోరుకున్నా” అని అతని సిటీ లైఫ్​ గురించి చెప్పాడు హరిఓమ్​. 2013లో టీమ్ లీడ్‌‌గా  ఎదిగినా.. మంచి  సంపాదన వస్తున్నా.. అన్నీ వదులుకొని ఇంటికి వెళ్లిపోయాడు. అతను తీసుకున్న ఆ సాహసోపేత నిర్ణయం వల్లే ‘ధాన్య ధేను’ అనే సొంత బిజినెస్​ వెంచర్ ఏర్పడింది. ప్రస్తుతం దీని ద్వారా పాలు, నెయ్యి, పనీర్, పెరుగు, మావా లాంటి అనేక రకాల మిల్క్​ ప్రొడక్ట్స్​,15 రకాల ఊరగాయలు, 20 రకాల క్యాండీలు అమ్ముతున్నాడు.  

ఆఫీస్​ నుంచి గోశాలకు

హరిఓమ్​ ఉద్యోగం విడిచిపెట్టాడని తెలియగానే ఊళ్లో వాళ్లంతా విమర్శించారు. అతన్ని ‘నికమ్మా (పనికిరానివాడు), పాగల్ (పిచ్చివాడు)’ అంటూ పిలవడం మొదలుపెట్టారు. దాంతో హరిఓమ్​ ఊళ్లో జరిగే శుభకార్యాలు, బంధువుల ఇండ్లకు వెళ్లడం మానేశాడు. అయినా.. వాళ్లు హేళన చేయడం మానలేదు. చదువు మానేస్తామని పిల్లలు ఎవరైనా అంటే.. వాళ్లకు హరిఓమ్​ని ఎగ్జాంపుల్​గా చూపించి.. అలా అయిపోతారని భయపెట్టేవాళ్లు. ఇవన్నీ చూసి హరిఓమ్​కి విసుగెత్తిపోయింది.  మనుషులకు దూరంగా ఉండాలని తన ఇంటికి దగ్గర్లో ఒక పర్మినెంట్​ షెల్టర్​, గోశాల కట్టించుకున్నాడు. అక్కడే అతనికి ఓదార్పు దొరికింది. 

“మాకు ఒక పెంపుడు ఆవు ఉంది. దానికి చిన్న దూడ ఉండేది. పొద్దంతా ఆ దూడతోనే ఆడుకునేవాడిని. అది కూడా నాతో ప్రేమగా ఉండేది. మనుషుల మధ్య ఉన్నప్పుడు ఊపిరాడనట్టు బతికిన నాకు ఆ గోశాలలో చాలా ప్రశాంతత దొరికింది. 

పాడి పరిశ్రమలోకి.. 

హరిఓమ్​కి ఆ గోశాలలో ఉన్నప్పుడే పాడి పరిశ్రమ మొదలుపెట్టాలనే ఆలోచన వచ్చింది. ఆ నిర్ణయం గురించి చెప్తే అందరూ వెక్కిరించారు. వద్దన్నారు. అయినా కూడా అప్పటివరకు అతను దాచుకున్న డబ్బుతో పది ఆవులు కొన్నాడు. వాటి నుంచి వచ్చే పాలను స్థానికులకు అమ్మాడు. కానీ.. అతను ఉండేది చాలా చిన్న ఊరు కావడంతో పాలు అమ్ముడుపోయేవి కాదు. ఊళ్లో చాలామంది అప్పటికే రెగ్యులర్​గా కొంతమంది  రైతుల దగ్గర పాలు కొనేవాళ్లు. అన్ని ఆవులు ఒకే టైంలో పాలిస్తే.. ప్రతిరోజు 50–60 లీటర్ల పాలు మిగిలేవి. కాబట్టి హరిఓమ్​కి పాలను ఫ్రీగా ఇవ్వడం తప్ప మరో మార్గం కనిపించలేదు. 

తొమ్మిది రూపాయల లాభం

హరిఓమ్​ తెల్లవారుజామున రెండు గంటలకే నిద్ర లేచేవాడు. పాలు పితికాక కొన్ని పాలు ఎలాగైనా  అమ్మాలనే ఆశతో వాటిని తీసుకుని బయటికి వెళ్లేవాడు. అలా అతను పాలు అమ్మడం వల్ల వచ్చిన డబ్బులో నుంచి ఖర్చులు పోనూ.. రోజుకు తొమ్మిది రూపాయలు మాత్రమే మిగిలేవి. మిగిలిన పాలు ఫ్రీగా ఇచ్చేసేవాడు. ఇక లాభం లేదనుకుని అతని తల్లిదండ్రులు ఇరుగుపొరుగు వాళ్లకు ఫ్రీగా పాలు పోయడం మొదలుపెట్టారు. ఒకప్పుడు అతన్ని వెక్కిరించిన వాళ్లు కూడా పాల కోసం వాళ్ల ఇంటికి వచ్చేవాళ్లు. 

లాభాల బాటలోకి

తనను వెక్కిరించిన వాళ్ల దగ్గర తానేంటో నిరూపించుకోవాలి అనుకున్నాడు హరిఓమ్. కొన్నాళ్లకు ఆ టైం రానే వచ్చింది. హరిఓం దగ్గర పాలు కొనేవాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది. దాంతో ఆ ఊళ్లో ఉండే పాడి రైతులంతా కలిసి హరిఓమ్​ దగ్గరకు వెళ్లారు. ‘‘పాల అమ్మకాలు పెరుగుతున్నాయి. పాలకోసం అని మరిన్ని ఆవులు కొనొద్దు. మా దగ్గరనుంచి పాలు కొని మాకు సాయం ​చెయ్యి”అని అడిగారు. దాంతో.. 2016 నాటికి హరిఓమ్ ఊళ్లో ఒక పాల సేకరణ కేంద్రాన్ని పెట్టాడు. పెట్టుబడి కోసం డెయిరీ ప్రాజెక్టులను సపోర్ట్​ చేయడానికి ప్రభుత్వం ఇచ్చే రాయితీలను తీసుకున్నాడు. 

సేంద్రియం వైపు...

అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో..  బిజినెస్​ పెట్టిన కొన్నాళ్లకు తన దగ్గరున్న పశువులకు, తాను పాలు సేకరించే రైతుల పశువులకు సేంద్రియ పశుగ్రాసం మాత్రమే పెట్టాలని నిర్ణయించుకున్నాడు. రెగ్యులర్​గా క్వాలిటీ చెక్​ చేస్తుండడం వల్ల ప్రజలకు నాణ్యమైన పాలు అమ్మగలిగాడు. దాంతో తక్కువ టైంలోనే మంచి పేరొచ్చింది. కస్టమర్లలో నమ్మకాన్ని పెంచడానికి వాళ్లకు ఉచితంగా లాక్టోమీటర్లు కూడా ఇచ్చాడు. ‘ఈ మీటర్లలో రీడింగ్ 26 (సాధారణ పాల డెన్సిటీ) కంటే తక్కువ ఉంటే ఆ రోజు పాలు ఫ్రీగా ఇస్తాన’ని చెప్పాడు. ఆ ప్లాన్​ బాగా పనిచేసింది. అందుకే హరిఓమ్​ అమ్మే పాలకు డిమాండ్​ విపరీతంగా పెరిగింది. ‘ధన్య ధేను’ పేరుతో  ఒక ప్రాసెసింగ్​ యూనిట్​ పెట్టాడు. ఇప్పుడు అతను డెహ్రాడూన్​, రిషికేశ్‌‌లోని ప్రజలకు రోజూ 250 లీటర్ల పాలను అమ్ముతున్నాడు.’’

మిగులుపాలతో..

బిజినెస్​ పెరిగాక కూడా కొన్నిసార్లు పాలు మిగులుతుండడంతో బిజినెస్​ని ఎక్స్​పాండ్​ చేశాడు. మిగులుపాలతో రకరకాల ప్రొడక్ట్స్​ తయారుచేయడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా.. మావా, ఐస్ క్రీం, రబ్రీ, ఫలూదా లాంటివి ఎక్కువగా చేస్తున్నాడు. ఈ కంపెనీ ప్రొడక్ట్స్​లో పల్లర్ (మజ్జిగతో చేసి.. పులియబెట్టిన ఒక రకమైన దేశీ డ్రింక్​) చాలా ఫేమస్​ అయ్యింది. ఆ తర్వాత రకరకాల ప్రొడక్ట్స్​ మార్కెట్​లోకి తీసుకొచ్చాడు. అవన్నీ సక్సెస్​ అయ్యాయి. ఇప్పుడు అతని ప్రొడక్ట్స్​ని లోకల్​ మార్కెట్లు, ట్రేడ్ ఫెయిర్లు, సప్లయ్​ చైన్స్​ ద్వారా అమ్ముతూ.. ఏటా రెండు కోట్ల రూపాయల లాభం పొందుతున్నాడు. ఫల్సువా, ఘమౌలి, బర్కోట్‌‌తో సహా15 గ్రామాల నుంచి 500 మందికిపైగా హరిఓమ్​ కంపెనీలో పనిచేస్తున్నారు. 

మర్చిపోలేను

“వ్యాపారం మొదలుపెట్టిన మొదటి ఆరు నెలలు జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. పచ్చి మేతకు అయ్యే ఖర్చును అమ్మకాలపై వచ్చిన ఆదాయం నుంచి తీసేస్తే.. లాభంగా రోజుకు తొమ్మిది రూపాయలు మాత్రమే మిగిలిన రోజులవి. డబ్బు సంపాదించడం చాలా కష్టం అనిపించింది. ఈ రోజు కేవలం పాలతోనే రోజుకు 5,000 రూపాయలకు పైగా లాభం వస్తోంది. నా మీద నాకు నమ్మకం లేకున్నా, ఓపిక లేకపోయినా, నేను ఇంత దూరం వచ్చేవాడిని కాదు. ఇప్పుడు నా డెయిరీ వెంచర్ వల్ల ఊళ్లోనే ఉండి ఎటువంటి ఒత్తిడి లేకుండా పనిచేసుకుంటున్నా. స్వచ్ఛమైన గాలిని పీలుస్తున్నా. పౌష్టికాహారం తింటున్నా. డబ్బు కూడా బాగా సంపాదిస్తున్నా. ఇంతకన్నా ఇంకేం కావాలి” అంటున్నాడు హరిఓమ్. 

రిషికేశ్‌‌లో ఉంటున్న బీనా తొమ్మిదేళ్లుగా ‘ధన్య ధేను’ కస్టమర్‌‌. ఆమె తన ఎక్స్​పీరియెన్స్ చెప్తూ “నేను హరిఓమ్ దగ్గర్నించి రోజూ రెండు లీటర్ల పాలు కొంటున్నా. మొదట్లో పాల క్వాలిటీని టెస్ట్​ చేసుకోవడానికి లాక్టోమీటర్ ఇచ్చాడు. అప్పుడే ఆ పాల నుంచి దుర్వాసన రాదని, అందులో కల్తీ లేదని గుర్తించా. ఢిల్లీలో ఉండే నా పిల్లలకు కూడా ధన్య ధేను కంపెనీ పల్లర్​ అంటే ఇష్టం. అందుకే వాళ్లు ఇంటికి వచ్చినప్పుడల్లా పల్లర్స్​ బాటిల్స్​ తీసుకెళ్తుంటారు.