ఇంట్లో ముగ్గురు పనోళ్లు.. అంత పెద్ద సాఫ్ట్ వేర్ ఉద్యోగం.. అయినా ఫ్యామిలీతో సహా ఆత్మహత్య

బెంగుళూరు: అతని పేరు అనూప్ కుమార్.. భార్య పేరు రాఖీ.. 38 ఏళ్ల అనూప్ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పెద్ద ఉద్యోగం.. వీరిది ఉత్తరప్రదేశ్ అయినా.. ఉద్యోగ రీత్యా బెంగళూరులో ఉంటున్నారు. సాఫ్ట్ వేర్ కన్సల్టెన్సీ ఆఫీసర్‎గా ఉన్న అనూప్.. పెద్ద జీతమే సంపాదిస్తున్నాడు.. అతనికి ఐదేళ్ల అనుప్రియ అనే కుమార్తె..  ప్రియాంష్ అనే రెండేళ్ల కొడుకు.. ఇద్దరు పిల్లలను చంపి.. ఆ తర్వాత అనూప్, రాఖీ భార్యభర్తలు ఉరేసుకుని చనిపోయారు. బెంగళూరు సిటీలో సంచలనంగా మారిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అనూప్ కుమార్ కటుంబంతో కలిసి బెంగుళూరులో నివాసం ఉంటున్నాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ కన్సల్టెంట్‌గా జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అనూప్ కుమార్, రాఖీ దంపతులకు అనుప్రియ, ప్రియాంష్ ఇనే ఇద్దరు పిల్లలున్నారు. పిల్లల బాగోగులు చూసుకునేందుకు రూ.15 వేల చొప్పున వేతనం ఇస్తూ ముగ్గురు పని మనుషులను నియమించాడు అనూప్. ఇదిలా ఉండగా.. 2025 జనవరి 6వ తేదీన రోజు మాదిరిగానే పనివాళ్లు అనూప్ ఇంటికి వచ్చారు. డోర్ క్లోజ్ చేసి ఉండటంతో యాజమానిని లేపేందుకు ఎన్నోసార్లు తలుపు కొట్టిన లోపలి నుండి ఉలుకు లేదు పలుకు లేదు. ఏమైందో అర్థంకాక పనివారు అనూప్ ఇంటి పక్కవారికి సమాచారం ఇవ్వగా వారు కూడా ఎన్నిసార్లు డోర్ కొట్టినా తెరవలేదు. 

దీంతో పోలీసులకు సమచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా అనూప్ ఫ్యామిలీ మొత్తం విగతజీవులుగా పడి ఉన్నారు. ఓ రూమ్‎లో పిల్లులు.. మరో రూమ్‎లో అనూప్ అతడి భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అనూప్ అతడి వైఫ్ రాఖీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకునే ముందు పిల్లలకు విషమిచ్చి చంపేశారని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్నట్లు తెలిపారు. దర్యాప్తు తర్వాత కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు పోలీసులు. అనూప్ కూతురు అనుప్రియ మానసిక సరిగ్గా ఉండేది కాదని.. ఆమె ఎప్పుడూ అనారోగ్యానికి గురయ్యేదని ఇంట్లో పని మనుషులు తెలిపారు. 

అనుప్రియ విషయంలో తల్లిదండ్రులు ఎప్పుడూ బాధ పడుతుండే వారని.. ఎన్ని ఆసుపత్రుల్లో చూపించినప్పటికీ ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో ఆవేదన చెందేవారని చెప్పారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక వారు ఈ దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చని పని మనుషులు ఓ మీడియా సంస్థకు తెలిపారు. నిన్నటి వరకు కుటుంబమంతా సంతోషంగా ఉన్నారని.. పాండిచ్చేరి ట్రిప్‎కు వెళ్లేందుకు ప్లాన్ కూడా చేసుకున్నారని.. ఇంతలోనే నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఘటనా స్థలంలో ఇప్పటి వరకు ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని తెలిపిన పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. పని మనుషుల స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని విచారణ చేస్తున్నామన్నారు పోలీసులు. భారీ వేతనం వచ్చే టెకీ ఫ్యామిలీ మొత్తం ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడటం బెంగుళూరులో చర్చనీయాంశంగా మారింది.