రీఎంట్రీ బాటలో షమీ

గురుగ్రామ్‌‌‌‌ : టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ రీఎంట్రీకి రెడీ అవుతున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న షమీ డొమెస్టిక్ క్రికెట్ ఆడి తిరిగి నేషనల్ టీమ్‌‌‌‌లోకి వస్తానని చెబుతున్నాడు. తన మోకాలి వాపు, నొప్పి పూర్తిగా తగ్గిందని షమీ తెలిపాడు. ఈ నేపథ్యంలో ఒకటి రెండు డొమెస్టిక్ మ్యాచ్‌‌‌‌లు ఆడి ఫిట్‌‌‌‌నెస్ నిరూపించుకుంటానని అంటున్నాడు.  ఆస్ట్రేలియా టూర్‌‌‌‌‌‌‌‌కు ముందు టీమ్ సెలెక్షన్‌‌‌‌కు అందుబాటులోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

గతేడాది వన్డే వరల్డ్ కప్‌‌‌‌ తర్వాత గాయంతో ఆటకు దూరమైన  షమీ బెంగళూరులో ఇండియా–న్యూజిలాండ్ మ్యాచ్ తర్వాత ఆదివారం నెట్స్‌‌‌‌లో పూర్తి స్థాయిలో బౌలింగ్ చేశాడు. మొన్నటి వరకూ సగం రనప్‌‌‌‌తో బౌలింగ్ చేసిన తాను ఇప్పుడు పూర్తి రనప్‌‌‌‌తో బంతులు విసురుతున్నానని తెలిపాడు.  ఆసీస్‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌కు ఇంకా సమయం ఉండటంతో ఆలోపు  మ్యాచ్‌‌‌‌ ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ సాధిస్తానన్న నమ్మకముందని షమీ చెప్పాడు.