IND vs BAN 2nd Test: ఇంగ్లాండ్‌ను మించిన విధ్వంసం.. 52 ఓవర్లలో టీమిండియా టెస్ట్ విజయం

టెస్ట్ క్రికెట్ లో ఇంగ్లాండ్ జట్టుకు దూకుడుగా ఆడతారనే పేరుంది. బజ్ బాల్ గేమ్ అంటూ ప్రపంచానికి కొత్త ఫార్ములా కనిపెట్టి టెస్టులపై ఆసక్తి పెంచారు. ఫలితం ఎలాగున్నా ఇంగ్లాండ్ ఆట తీరులో మార్పు రాలేదు. అయితే భారత్ మాత్రం ఇంగ్లాండ్ ను మించిపోయే ఆట ఆడింది. కాన్పూర్ టెస్టులో బంగ్లాదేశ్ పై విజయం కోసం రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి కేవలం 52 ఓవర్లలో విజయాన్ని సాధించడం ప్రస్తుతం సంచలనంగా మారుతుంది. 

తొలి ఇన్నింగ్స్ లో భారత్ 34.4 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 285 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇన్నింగ్స్ రన్ రేట్ 8కి పైగా ఉండడం విశేషం. మ్యాచ్ గెలుపు కోసం ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి విధ్వంసకర ఆట తీరుతో బంగ్లా బౌలర్లను చితక్కొట్టారు. వచ్చిన వారు వచ్చినట్టు చెలరేగి టీ20 గేమ్ ఆడారు. దీంతో బంగ్లాను త్వరగానే రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు ఆహ్వానించింది. రెండో ఇన్నింగ్స్ బౌలర్ల చెలరేగడంతో 146 పరుగులకే కుప్పకూలారు. ఆ తర్వాత 95 పరుగుల లక్ష్యానికి కూడా ఎక్కువ సమయం తీసుకోలేదు. 6 రన్ రేట్ తో మ్యాచ్ ను ఫినిష్ చేశారు. 

తొలి మూడు రోజులు వర్షం కారణంగా 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. రెండు రోజుల్లో ఫలితం ఆసాధ్యమని అందరూ భావించారు. అయితే భారత్ అసాధారణ పోరాటంతో చివరి రోజు మ్యాచ్ మూడో సెషన్ కు వెళ్లకుండానే పూర్తయింది. రోజున్నరలోనే అద్బుతం చేశారు. ఇంగ్లాండ్ కంటే దూకుడుగా భారత్ ఆడగలదని.. ఈ విషయాన్ని మరోసారి భారత్ నిరూపించిందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read :- హిట్ మ్యాన్ కెప్టెన్సీ అదిరింది

ఈ మ్యాచ్ విషయానికి వస్తే చివరి రోజు బంగ్లాదేశ్ విధించిన 95 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 3 వికెట్లు కోల్పోయి 14 ఓవర్లలో ఛేజ్ చేసింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (40), కోహ్లీ (24) జాగ్రత్తగా ఆడి భారత్ కు విజయాన్ని అందించారు. రోహిత్ (8), గిల్ (6) విఫలమయ్యారు. దీంతో భారత్ సిరీస్ ను 2-0 తేడాతో గెలుచుకుంది. తొలి మూడు రోజుల తర్వాత డ్రా ఖాయమన్న దశలో చివరి రెండు రోజులు రోహిత్ సేన అసాధారణంగా పోరాడి గెలిచింది.