IND vs AUS: అచ్చిరాని ఆదివారం.. ఆస్ట్రేలియా గడ్డపై ఒకేరోజు రెండు ఓటములు

భారత క్రికెట్ అభిమానులకు ఆదివారం(డిసెంబర్ 08, 2024) ఓ చీకటి రోజుగా మిగిలిపోయింది. సెలవు రోజు భారత జట్ల విజయాలను తనివితీరా చూస్తూ ఎంజాయ్ చేద్దామనుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. పింక్‌బాల్ టెస్టులో రోహిత్ సేన 10 వికెట్ల తేడాతో పరాజయం పాలవ్వగా.. భారత మహిళలు అదే బాటలో నడిచారు. 

ఆదివారం ఆతిథ్య ఆసీస్ మహిళలతో జరిగిన రెండో వన్డేలో భారత మహిళా జట్టు 122 పరుగుల తేడాతో చిత్తయ్యింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలై సిరీస్ చేజార్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 371 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో భారత్ 249 పరుగులకే కుప్పకూలింది.

Also Read :- ఆస్ట్రేలియా మళ్లీ నెంబర్.1.. మూడో స్థానానికి టీమిండియా

దొందూ దొందే

చెప్పుకోవడానికి ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ భారత జట్లు అన్న పేరు తప్ప ఆటలో ఆ గొప్పతనం ఎక్కడా కనిపించడం లేదు. బీసీసీఐ కాంట్రాక్ట్‌లకు డోకా లేకపోవడం.. ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ వల్ల డబ్బులకు కొదవలేకపోవడంతో మన క్రికెటర్లు మైదానంలోకి దిగితే చాలన్నట్లు ప్రవర్తిస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా ఆటాడుతూ అభిమానులను నిరాశ పరుస్తున్నారు. అందుకు ఉదహరణ.. అడిలైడ్ వేదికగా ముగిసిన పింక్‌బాల్ టెస్టు.ఐదు రోజుల టెస్టు కాస్త రెండున్నర రోజుల్లోనే ముగిసిందంటే మనోళ్లు ఏమాత్రం ఆడారో అర్థం చేసుకోవాలి. కష్టకాలంలో జట్టును ఆదుకోవలసిన సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు జట్టుకు మరింత భారంగా మారారు. వీరిద్దరూ ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తారా..! అని అభిమానాలు వేచి చూస్తున్నారు.  

  
పురుషులతో పోలిస్తే రెండో వన్డేలో భారత మహిళలు కాస్త పోరాట పటిమనే చూపారని చెప్పుకోవాలి. తొలి వన్డేలో 100 పరుగులకే ఆలౌట్ అవ్వగా.. రెండో వన్డేలో ఓడినా.. 249 పరుగులు చేయడం ఓ రకంగా గొప్పే అనుకోవాలి. ఈ ఓటములపై బీసీసీఐ విశ్లేషణలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. రోహిత్, కోహ్లీలను టెస్ట్ జట్టు నుంచి తప్పించడంతో పాటు.. మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించే దిశగా అడుగులు వేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.