అడిలైడ్: బోర్డర్-–గావస్కర్ ట్రోఫీ పింక్ బాల్ టెస్టులో వరుసగా రెండో రోజూ టీమిండియా తడబడింది. ట్రావిస్‌హెడ్ (141 బాల్స్‌లో 17 ఫోర్లు, 4 సిక్సర్లతో 140) సూపర్ సెంచరీకి తోడు బౌలింగ్‌లోనూ అదరగొట్టిన ఆస్ట్రేలియా రెండో టెస్టును తన చేతుల్లోకి తీసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థికి భారీ ఆధిక్యం ఇచ్చుకున్న టీమిండియా శనివారం, రెండో రోజు చివరకు రెండో ఇన్నింగ్స్‌లో 128/5 స్కోరుతో నిలిచి ఓటమికి ఎదురీదుతోంది. శుభ్‌మన్ గిల్ (28), యశస్వి జైస్వాల్ (24) శుభారంభాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు.
కేఎల్ రాహుల్ (7)తో పాటు విరాట్ కోహ్లీ (11), కెప్టెన్ రోహిత్ శర్మ (6) మళ్లీ నిరాశపరిచారు. ఆసీస్ స్కోరుకు ఇండియా ఇంకా 29 రన్స్ వెనుకంజలో ఉండగా.. క్రీజులో ఉన్న రిషబ్ పంత్ (28 బ్యాటింగ్), నితీశ్ రెడ్డి (15 బ్యాటింగ్)పైనే ఆశలు ఉన్నాయి. వీళ్లు అద్భుతం చేస్తే తప్ప రోహిత్‌సేన ఈ మ్యాచ్‌లో గెలిచే అవకాశం కనిపించడం లేదు. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 337 రన్స్ వద్ద ఆలౌటైంది. హెడ్‌కు తోడు మార్నస్ లబుషేన్ (64) కూడా ఆకట్టుకున్నాడు. బుమ్రా, సిరాజ్ చెరో నాలుగు, అశ్విన్, నితీశ్ రెడ్డి ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఇండియాకు ‘తల’పోటు
తొలి రోజు పేసర్ మిచెల్ స్టార్క్ ఇండియాను దెబ్బకొడితే.. రెండో రోజు ట్రావిస్ హెడ్ తలపోటు తెప్పించాడు. రికార్డు స్థాయిలో 50 వేల మంది ఫ్యాన్స్‌తో నిండిన స్టేడియంలో వన్డే స్టయిల్ ఆటతో చెలరేగిన హెడ్ పింక్ సవాల్‌లో ఆతిథ్య జట్టు పూర్తి పైచేయి సాధించేలా చేశాడు. ఓవర్‌నైట్ స్కోరు 86/1తో ఆసీస్ ఆట కొనసాగించగా పేస్ లీడర్ బుమ్రా స్టార్టింగ్‌లోనే నేథన్ మెక్‌స్వీని (39)తో పాటు స్టీవ్ స్మిత్ (2)ను ఔట్ చేసి ఇండియాకు మంచి ఆరంభం అందించాడు. కానీ, ఓ ఎండ్‌లో పదునైన బౌలింగ్‌తో సత్తా చాటుతున్న బుమ్రాకు సపోర్ట్ కరువైంది.
దాంతో లబుషేన్,హెడ్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. బుమ్రాను జాగ్రత్తగా ఆడుతూనే.. మిగతా బౌలర్లపై ఎదురుదాడి చేశారు. చివరకు నితీశ్ రెడ్డి బౌలింగ్‌లో లబుషేన్.. యశస్వికి క్యాచ్ ఇవ్వడంతో నాలుగో వికెట్‌కు 65 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయింది. కానీ, అప్పటికే క్రీజులో కుదురుకున్న హెడ్ క్రమంగా స్పీడు పెంచి 191/4తో తొలి సెషన్ ముగించాడు. బ్రేక్ తర్వాత మిచెల్ మార్ష్ (9)ను అశ్విన్ ఔట్ చేసినా.. హెడ్ మరింత జోరు పెంచాడు.
క్యారీ (15)తో కలిసి ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయి111 బాల్స్‌లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, కొత్త బాల్ వచ్చిన తర్వాత సిరాజ్ ఒక్కసారిగా విజృంభించాడు. కీపర్ క్యాచ్‌తో క్యారీ (15)ని ఔట్ చేసి ఆరో వికెట్‌కు 74 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ చేసిన అతను హెడ్‌ను పదునైన యార్కర్‌తో క్లీన్‌బౌల్డ్ చేశాడు. బుమ్రా బౌలింగ్‌లో కమిన్స్ (12) బౌల్డ్ అవ్వగా.. స్టార్క్ (18), బోలాండ్ (0)ను వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చిన సిరాజ్ ఆసీస్ ఇన్నింగ్స్‌ను ముగించాడు.
టాప్ మళ్లీ ఢమాల్
157 రన్స్ లోటు స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌కు వచ్చిన టీమిండియా ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఆసీస్ పేసర్ల ముందు తేలిపోయింది. ఓపెనర్ రాహుల్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లోనే కమిన్స్ షార్ట్ బాల్‌ను పుల్ చేయబోయి కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. మరో ఓపెనర్ యశస్వి, గిల్ రెండో వికెట్‌కు 30 రన్స్ జోడించి కుదురుకునే ప్రయత్నం చేశారు. కానీ, కొత్త పేసర్ బోలాండ్ తన తొలి బాల్‌కే యశస్విని ఔట్ చేసి ఈ జోడీని విడదీశాడు. ఆ వెంటనే ఫోర్త్ స్టంప్‌పై ఊరించే బాల్‌తో విరాట్ కోహ్లీని కూడా కీపర్ క్యాచ్‌తో వెనక్కు పంపి ఇండియాకు డబుల్ షాక్ ఇచ్చాడు.
ఈ దశలో క్రీజులోకి వచ్చిన పంత్ తన తొలి బాల్‌కే బౌండ్రీ కొట్టాడు. బోలాండ్ బౌలింగ్‌లో వెరైటీ షాట్‌తో మరో ఫోర్ రాబట్టాడు. కానీ, స్టార్క్ ఖతర్నాక్ ఫుల్ లెంగ్త్ బాల్‌తో గిల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే రోహిత్‌ను కూడా బౌల్డ్ చేశాడు. కానీ, అది నో బాల్ కావడంతో బతికిపోయిన హిట్‌మ్యాన్ ఈ చాన్స్‌ను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కమిన్స్ బౌలింగ్‌లో బౌల్డ్ అవ్వడంతో 105 రన్స్‌కే ఇండియా సగం వికెట్లు కోల్పోయింది. పంత్‌కు తోడైన నితీశ్ మరో వికెట్ పడకుండా రోజును ముగించాడు.
సిరాజ్ x హెడ్
ఆసీస్ ఇన్నింగ్స్ సమయంలో సిరాజ్, హెడ్ మధ్య వాగ్వాదం మ్యాచ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తన బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన హెడ్‌ను సిరాజ్ తర్వాతి బాల్‌కే క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ ఆనందంలో గట్టిగా అరుస్తూ.. వెళ్లిపో అన్నట్టుగా ఆసీస్ ప్లేయర్‌కు సెండాఫ్ ఇచ్చాడు. అదే సమయంలో హెడ్ కూడా ఏదో అనడంతో ఇద్దరూ ఒకరినొకరూ కోపంగా చూసుకున్నారు. అయితే, సిరాజ్ తనను బౌల్డ్ చేసినప్పుడు బాగా బౌలింగ్ చేశావని అన్నానని, దాన్ని అతను తప్పుగా అర్థం చేసుకొని తన మీదకు వచ్చాడని ఆట ముగిసిన తర్వాత హెడ్ చెప్పాడు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా తొలి ఇన్నింగ్స్: 180 ఆలౌట్;. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 87.3 ఓవర్లలో 337 ఆలౌట్ (హెడ్ 140, లబుషేన్ 64, బుమ్రా 4/61, సిరాజ్ 4/98); ఇండియా రెండో ఇన్నింగ్స్: 24 ఓవర్లలో 128/5 (గిల్ 28, పంత్ 28 బ్యాటింగ్, కమిన్స్ 2/33)