పింక్ ప్రాక్టీస్‌‌‌‌: బ్యాటింగ్‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌పై టీమిండియా ఫోకస్

  • నేటి నుంచి ఆసీస్‌‌‌‌ పీఎం ఎలెవన్‌‌‌‌తో వామప్ మ్యాచ్‌‌‌‌
  • ఉ. 9.10 నుంచి స్టార్‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌, హాట్‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌లో లైవ్‌‌‌‌

కాన్‌‌‌‌బెర్రా: స్వదేశంలో న్యూజిలాండ్‌‌‌‌ చేతిలో కంగుతిన్న తర్వాత బోర్డర్‌‌‌‌‌‌‌‌–గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా ఇప్పుడు ఆస్ట్రేలియాతో పింక్‌‌‌‌ బాల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ సవాల్‌‌‌‌కు సన్నద్ధం అవుతోంది. ఆసీస్, ఇండియా మధ్య డిసెంబర్ 6 నుంచి  అడిలైడ్‌లో  రెండో టెస్టు పింక్‌‌‌‌ బాల్‌‌‌‌తో డే నైట్ జరగనుంది. ఈ పోరుకు ముందు ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్‌‌‌‌ ఎలెవన్ జట్టుతో రోహిత్‌‌‌‌సేన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌‌‌‌లో పోటీపడనుంది.

శనివారం మొదలయ్యే ఈ వామప్‌‌‌‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకొని డే నైట్ టెస్టుకు అస్త్రాలను సిద్ధం చేసుకోవాలని చూస్తోంది. టీమిండియా ఇప్పటి వరకు నాలుగు డే నైట్‌‌‌‌ టెస్టులు ఆడింది. వీటిలో ఒకేసారి నాలుగేండ్ల కిందట అడిలైడ్‌‌‌‌లోనే ఓడిపోయింది. నాడు 36 రన్స్‌‌‌‌కే ఆలౌటైన ఇండియా అద్భుతంగా పుంజుకొని నాలుగు టెస్టుల సిరీస్‌‌‌‌ను గెలుచుకుంది. రెగ్యులర్ రెడ్‌‌‌‌ బాల్‌‌‌‌తో పోలిస్తే పింక్‌‌‌‌ బాల్‌‌‌‌తో ఆట సవాల్‌‌‌‌తో కూడుకున్నది.

ముఖ్యంగా సాయంత్రం ముగిసి చీకటి పడే సమయంలో బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడతారు. ఈ నేపథ్యంలో  డే నైట్ టెస్టుకు ముందు వామప్ పోరులో పింక్‌‌‌‌ బాల్‌‌‌‌కు అలవాటు పడాలని టీమిండియా   కోరుకుంటోంది. ఇది ఫస్ట్‌‌‌‌ క్లాస్ గేమ్ కాకపోవడంతో  ఆటగాళ్లంతా బ్యాటింగ్‌‌‌‌ చేసే అవకాశం ఉంది. మరోవైపు పెర్త్‌‌‌‌లో సూపర్ విక్టరీ తర్వాత జట్టు ఆత్మవిశ్వాసంతో ఉండగా కెప్టెన్ రోహిత్ శర్మ, గాయం నుంచి కోలుకున్న శుభ్‌‌‌‌మన్ గిల్‌‌‌‌ తిరిగి రావడంతో జోష్ మరింత పెరిగింది. వామప్‌‌‌‌లో ఈ ఇద్దరిపై అందరి దృష్టి ఉండనుంది. 

బరిలోకి రోహిత్, గిల్‌‌‌‌

రోహిత్‌‌‌‌, గిల్‌‌‌‌ గైర్హాజరీలో యశస్వి జైస్వాల్‌‌‌‌తో కలిసి కేఎల్ రాహుల్‌‌‌‌ పెర్త్‌‌‌‌లో ఓపెనర్‌‌‌‌‌‌‌‌గా వచ్చాడు. వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో దేవదత్ పడిక్కల్ బ్యాటింగ్‌‌‌‌ చేశాడు. రోహిత్‌‌‌‌, గిల్ రాకతో పింక్‌‌‌‌ బాల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో తుది జట్టులో మార్పులు ఖాయమే. అయితే, పెర్త్‌‌‌‌లో ఓపెనర్‌‌‌‌‌‌‌‌గా హిట్‌‌‌‌ అయిన రాహుల్‌‌‌‌ను అదే స్థానంలో ఆడించాలని, రోహిత్‌‌‌‌ వన్‌‌‌‌డౌన్‌‌‌‌ లేదా  మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌లో ఆడితే మంచిదని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. . రోహిత్ వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో ఆడాలని అనుకుంటే గిల్‌‌‌‌ బ్యాటింగ్ పొజిషన్‌‌‌‌ కూడా మార్చాల్సి ఉంటుంది.

వామప్‌‌‌‌ పోరు తర్వాత ఈ విషయంపై క్లారిటీ రానుంది. రెండో టెస్టులో ఆడే బ్యాటింగ్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ను వామప్‌‌‌‌లో పరీక్షించే అవకాశం కనిపిస్తోంది.  ఇక, బొటన వేలు గాయం నుంచి కోలుకున్న గిల్‌‌‌‌ శుక్రవారం జరిగిన నెట్ సెషన్‌‌‌‌లో పాల్గొన్నాడు. పేసర్లు యష్ దయాల్‌‌‌‌, ఆకాశ్‌‌‌‌ దీప్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్‌‌‌‌ చేయడంతో తను పూర్తి ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ సాధించేందుకు చేరువగా వచ్చాడని తెలుస్తోంది.

మరోవైపు మాట్ రెన్‌‌‌‌షా, స్కాట్‌‌‌‌ బోలాండ్‌‌‌‌ వంటి టెస్టు ప్లేయర్లు బరిలో నిలిచిన ఆసీస్‌‌‌‌ పీఎం ఎలెవన్ జట్టును ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ జాక్‌‌‌‌ ఎడ్వర్డ్స్‌‌‌‌ నడిపించనున్నాడు. చార్లీ అండర్సన్‌‌‌‌, మహ్లి బార్డ్‌‌‌‌మన్‌‌‌‌, ఐడాన్ ఓకానర్, సామ్ కాన్‌‌‌‌స్టాస్‌‌‌‌ వంటి ఆసీస్‌‌‌‌ అండర్‌‌‌‌–‌‌‌‌19 టీమ్ స్టార్స్‌‌‌‌, ఫాస్ట్ బౌలింగ్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్ హనో జాకబ్స్‌‌‌‌ ఈ జట్టులో బరిలోకి దిగుతున్నారు.