కేజీబీవీ పాఠశాలల్లో స్తంభించిన బోధన

ఆర్థిక స్తోమత లేని పేదలు ఎందరో  తమ కన్నబిడ్డల భవిష్యత్తు కోసం ముఖ్యంగా బాలికల భవిష్యత్తుకు  ప్రభుత్వ విద్యపైనే  ఆధారపడుతున్నారు.  ప్రభుత్వం రక్షణనిస్తుందని భావించి సంక్షేమ హాస్టళ్లు, కేజీబీవీలు పాఠశాలల్లో  తమ పిల్లలను చేర్పిస్తున్నారు.  పేద విద్యార్థులకు ముఖ్యంగా బాలికలకు మంచి విద్య అందించడానికి అండగా ఉంటూ ఉచిత విద్య, వసతి భోజనంతోపాటు బాలికలకు రక్షణను ప్రభుత్వం అందిస్తోంది. పేద బాలికల విద్యా వికాసానికి తోడ్పాటును అందిస్తోంది. అయితే, కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నామని చెబుతున్నా ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. ఎందుకంటే  కేజీబీవీల్లో గత కొన్ని వారాలుగా విద్యాబోధన  స్తంభించింది.10వ తరగతి ఇంటర్ వార్షిక పరీక్షలు సమీపిస్తుండడంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. 

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

కేజీబీవీ టీచర్లను, సర్వ శిక్ష ఉద్యోగులను పర్మినెంట్​ చేయాలని సర్వత్రా డిమాండ్ పెరుగుతున్నది. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు,  ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకుల కంటే అత్యధిక పని సమయాలతో  కేజీబీవీ టీచర్లు, అహర్నిశలు కృషి చేస్తున్నారు. రేయింబవళ్లు కేజీబీవీలో  విద్యార్థినులతో మమేకమై తమ పిల్లల కంటే ఎక్కువగా అభిమానిస్తూ విద్యా బోధన నిర్వహిస్తున్నారు. 

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిన ప్రభుత్వం కేజీబీవీ టీచర్లకు, నాన్ టీచింగ్ ఉద్యోగులకు అంతంత మాత్రంగా గత పది సంవత్సరాల నాటి  జీతభత్యాలనే కొనసాగిస్తున్నది.  కేజీబీవీలో గత పదేళ్లుగా విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పదవ తరగతిలో, ఇంటర్మీడియట్​లో  తొంబై శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణత శాతం నమోదు అవుతున్నది.  కొన్ని సబ్జెక్టులలో నూరుశాతం ఉత్తీర్ణత,  అత్యధిక మార్కులను విద్యార్థులు సొంతం చేసుకుంటున్నారు. సంవత్సరాల తరబడి అవిశ్రాంతంగా అంకితభావంతో బాధ్యతాయుతంగా పనిచేస్తున్న తమను పర్మినెంట్ చేయాలని,  టైం స్కేల్ ఇవ్వాలని కేజీబీవీ టీచర్లు, సర్వ శిక్ష ఉద్యోగులు నిర్వహిస్తున్న సమ్మెను  ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి వెంటనే సరైన నిర్ణయం తీసుకోవాలని సమాజంలోని అన్ని సంఘాలు ముక్తకంఠంతో కోరుతున్నాయి. 

సమీపిస్తున్న పబ్లిక్ పరీక్షలు

రాష్ట్ర వ్యాప్తంగా  గత 25 రోజులకుపైగా కేజీబీవీ టీచర్లు, సర్వ శిక్ష ఉద్యోగులు సమ్మెలో ఉండడంతో విద్యార్థులకు బోధన జరగడంలేదు. నిరసన కార్యక్రమాలతో  రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో,  మండల కేంద్రాలలో తమ ఆందోళనలను శాంతిమార్గంలో నిర్వహిస్తున్నారు. సర్వ శిక్ష ఉద్యోగులు నిర్వహిస్తున్న సమ్మెకు  పీడీఎస్​యూతో పాటు    పలు విద్యార్థి,  యువజన,  రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు తమ మద్దతును, సంఘీభావాన్ని తెలియజేస్తున్నాయి.  పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి తాము తెలంగాణా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే సర్వ శిక్ష ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే,  ప్రజా ప్రభుత్వం తమ డిమాండ్లను  విస్మరించిందని భావించిన సర్వ శిక్ష ఉద్యోగులు సమ్మె బాట పట్టడంతో  కేజీబీవీలలో విద్యాబోధన నిలిచిపోయింది. 

సమ్మెబాటలో  కేజీబీవీ టీచర్లు, సర్వ శిక్ష ఉద్యోగులు

జాతీయ అక్షరాస్యత  సగటు  తక్కువగా ఉన్న మండలాలలో  కేంద్ర ప్రభుత్వం  కస్తూరిబా గాంధీ విద్యాలయాలను, అర్బన్  రెసిడెన్షియల్ స్కూల్స్ ను 2004లో  దేశవ్యాప్తంగా 4,982 నెలకొల్పింది.  అందులో తెలంగాణ రాష్ట్రంలో 479 కస్తూరిబా గాంధీ విద్యాలయాలు, 30కుపైగా అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో నెలకొల్పారు. 316  కేజీబీవీలలో  జూనియర్ కాలేజీలను సైతం అప్ గ్రేడ్ చేశారు.  

ఈ విద్యార్థినులకు బోధనతోపాటు  రాత్రివేళల్లో  కనీసం ఇద్దరు టీచర్లు విద్యార్థులతోపాటు హాస్టల్లో ఉంటూ స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. 2 011లో  కేజీబీవీ  స్కూల్లో  టీచర్లుగా,  సర్వశిక్ష ఉద్యోగులుగా పని చేస్తున్నా,  వారికి అప్పటి విద్యార్థుల సంఖ్య,  వసతి ప్రకారమే ఇప్పటికీ  జీతభత్యాలను  ప్రభుత్వం అందిస్తున్నది.  ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల్లో  పనిచేస్తున్న  ప్రిన్సిపాల్స్​కు  లక్ష రూపాయలు, అధ్యాపకులకు 70 వేల రూపాయలకుపైన జీతభత్యాలు లభిస్తుండగా..  కేజీబీవీలో పనిచేస్తున్న అధ్యాపకులకు మాత్రం 29వేల రూపాయలు  మాత్రమే అందిస్తున్నారు.  

విద్యార్థుల భవిష్యత్తు?

సమాన పనికి  సమాన వేతనం ఇవ్వాలని కేజీబీవీ టీచర్లు, సర్వ శిక్ష ఉద్యోగులు సమ్మె నోటీస్ ఇచ్చి గత 25రోజులుగా బోధన బంద్ చేసి తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. మరోవైపు  వార్షిక పరీక్షలు సమీపిస్తుండడంతో  విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా, గందరగోళంగా మారింది.  సమస్యలు  పరిష్కరించాల్సిన ప్రభుత్వం  నామమాత్రంగా  ప్రత్యా మ్నాయ ఏర్పాట్లు చేస్తుందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

విద్యార్థుల్లో  పరీక్షల ఆందోళన

కేజీబీవీలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థినులు తమ విద్యను కొనసాగిస్తున్నారు.ఇంకా మూడు నెలలు మాత్రమే పదవ తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షలకు గడువు ఉంది.  ఇంటర్ విద్యార్థులకు  వచ్చే నెల 22వ తేదీన  జేఈఈ  మెయిన్స్ పరీక్షలు,  ఫిబ్రవరి నెలలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు,  మార్చి  నుంచి ఇంటర్ వార్షిక  పరీక్షలు,  మార్చి రెండో వారంలో  పదవ తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేజీబీవీ టీచర్ల సమ్మె విద్యార్థుల భవిష్యత్తుపై  తీవ్ర ప్రభావం చూపనున్నది.   కేజీబీవీలు, యూఆర్ఎస్, ఐఈఆర్పీ కేంద్రాల్లో క్లాసులు బంద్ అయ్యాయి. 

 ఇప్పటికే టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్ అయింది. ఇంకా సిలబస్ పూర్తికావాల్సి ఉంది.  ఇలాంటి సమయంలో టీచర్లు అందుబాటులో లేకపోవడంతో వారంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోపక్క ప్రత్యామ్నాయంగా కేజీబీవీల్లో ఎంఈఓలు, గవర్నమెంట్ స్కూల్ టీచర్లతో పాఠాలు చెప్పించే ప్రయత్నం చేసినా  ఆశించిన ఫలితం చూపించడం లేదు.  ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాల్సిన అవసరం ఉందని పేరెంట్స్,  విద్యార్థి సంఘాలు,  ఉద్యోగ సంఘాలు పొలిటికల్ పార్టీలు  ప్రభుత్వాన్ని  కోరుతున్నాయి.

- వెంకటేశ్,పీడీఎస్​యూ,తెలంగాణ రాష్ట్ర నాయకుడు-