తెలంగాణ నుంచి  ముగ్గురికి బెస్ట్ టీచర్ అవార్డులు

నేడు రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం 

న్యూఢిల్లీ/హైదరాబాద్, వెలుగు : తెలంగాణకు చెందిన ముగ్గురు టీచర్లను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు వరించాయి. డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీలో పి.ప్రభాకర్ రెడ్డి(తిరుమలాయపాలెం, జడ్పీహెచ్ఎస్), టి. సంపత్ కుమార్(దమ్మన్నపేట్, జడ్పీహెచ్ఎస్), హయ్యర్ ఎడ్యుకేషన్‌‌లో డాక్టర్ నందవరం మృదుల అవార్డులకు ఎంపికయ్యారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని బుధవారం దేశవ్యాప్తంగా 82 మందికి జాతీయ ఉపాధ్యాయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 

ఇందులో 50 మంది డిపార్ట్‌‌మెంట్‌‌ఆఫ్‌‌ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, 16 మంది హయ్యర్ ఎడ్యుకేషన్, 16 మంది మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌‌మెంట్‌‌ నుంచి ఎంపికయ్యారు. వీరంతా గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నారు. 

రాష్ట్రంలో 26 మంది ప్రొఫెసర్లు..41 మంది టీచర్లకు అవార్డులు 

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బెస్ట్ టీచర్ అవార్డులను ప్రకటిస్తూ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో కలిపి మొత్తం 26 మంది  ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అనుబంధ కాలేజీల్లో 29 మంది అవార్డులకు ఎంపికయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యా సాగర్, దరావత్ సూర్య, నరేష్ రెడ్డి, చంద్రశేఖర్, కాకతీయ నుంచి వెంకట్రామ్ రెడ్డి, శాతవాహన నుంచి పద్మావతి, తెలంగాణ నుంచి సుధాకర్, పాలమూరు నుంచి కిషోర్, మహత్మ గాంధీ నుంచి రమేష్ కుమార్, అంబేద్కర్ నుంచి శ్రీనివాసరావు, జేఎన్టీయూ నుంచి సునీత, నరసింహ, శోభరాణి, నల్సార్ నుంచి శాంతి, నిమ్స్ నుంచి చంద్రశేఖర్, బాసర ఆర్జేయూకేటీ నుంచి చంద్రశేఖర్ రావు ఉన్నారు. 10 మంది గెజిటెడ్ హెడ్ మాస్టర్లు, 20 మంది స్కూల్ అసిస్టెంట్లు  అవార్డులకు ఎంపికయ్యారు. వీరికి గురువారం రవీంద్రభారతిలో సీఎం రేవంత్ రెడ్డి అవార్డులు ప్రదానం చేయనున్నారు.