- స్టూడెంట్లతో సెప్టిక్ ట్యాంక్ క్లీన్
- కర్నాటకలో రెసిడెన్షియల్ స్కూల్ టీచర్ల నిర్వాకం
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- సీఎం సీరియస్.. ప్రిన్సిపాల్‌పై వేటు
- విచారణకు ఆదేశించిన అధికారులు
కోలార్: స్కూల్‌లో విద్యార్థులతో సెప్టిక్ ట్యాంక్ ను క్లీన్ చేయించిన ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. కోలార్ జిల్లాలోని మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ స్కూలులో విద్యార్థులు సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ స్కూలులో 250 మందికి పైగా స్టూడెంట్లు చదువుకుంటున్నారు. వీరిలో 8,9, టెన్త్క్లాస్లకు చెందిన కొద్దిమంది పిల్లలతో స్కూల్ ప్రిన్సిపాల్, కొందరు టీచర్లు బడి ఆవరణలోని సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయించారు. విద్యార్థులకు పనిష్మెంట్గా ఈ పనులు చేయించినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి.
దీనిపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ మహదేవప్పను ఆదేశించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన మంత్రి మహదేవప్ప వెంటనే ప్రిన్సిపాల్, వార్డెన్, ఇతర అధికారులను సస్పెండ్ చేశారు. అలాగే స్కూల్లోని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సిబ్బందిని విధుల్లోంచి తొలగించారు.
ప్రిన్సిపాల్సహా ఈ ఘటనకు బాధ్యులైన అందరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నామని సోషల్ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ ఆర్.శ్రీనివాస్ తెలిపారు. సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ల కంప్లైంట్‌తో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
