బెల్ట్ షాపులు క్లోజ్ చేయించిన టీడీపీ ఎమ్మెల్యే: ఒక నియోజకవర్గంలోనే 130 బెల్టు షాపులు..

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివారవు బెల్టు షాపులపై ఆకస్మిక దాడి చేశారు. తిరువూరులోని వైన్ షాపుల పక్కన నడుపుతున్న బెల్ట్ షాపులను మూయించేశారు శ్రీనివాసరావు. నియోజకవర్గంలో ఉన్న బెల్ట్ షాపులను 24 గంటల్లో మూసేయాలని ఎక్సయిజ్ శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసే దుకాణాల లైసెన్సులను రద్దు చేయాలని ఆదేశించారు శ్రీనివాసరావు. తిరువూరు టౌన్ లో ఉన్న నాలుగు వైన్ షాపులను పట్టణ శివారుకు తరలించాలని డిమాండ్ చేశారు శ్రీనివాసరావు.

మంగళవారం ( డిసెంబర్ 17, 2024 ) వైన్ షాపులపై తనిఖీకి వెళ్లిన శ్రీనివాసరావు నిబంధనలను విరుద్ధంగా నడుపుతున్న నాలుగు మద్యం షాపులను మూయించారు. పాఠశాలకు, ఇళ్లకు, బస్టాప్ సమీపంలో ఉన్న వైన్ షాపులను పట్టణ శివారుకు తరలించాలని డిమాండ్ చేశారు.

ఒక్క తిరువూరు టౌన్ పరిధిలోనే 43 బెల్టు షాపులున్నాయని.. మొత్తం నియోజకవర్గ పరిధిలో 130 పైగా బెల్ట్ షాపులు మున్నాయని.. వీటన్నిటిని పూర్తిగా తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు శ్రీనివాసరావు. వైన్ షాపుల యజమానులే బెల్టు షాపులు నడుపుతున్నారని మండిపడ్డ కొలికపూడి.. సీఎంను కలిసి బెల్టుషాపులను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని కోరుతానని అన్నారు.