పవన్ పల్లకి మోసినంత మాత్రాన చేతులు కట్టుకు కూర్చోము - వర్మ

2024 ఎన్నికల్లో జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న టీడీపీ, జనసేన పార్టీలలో అసమ్మతి సెగ ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. తాము ఆశించిన సీటు దక్కని నేతలంతా పార్టీ అధిష్టానంపై అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం కేంద్రంగా ఇరుపార్టీల మధ్య ఆధిపత్య పోరు పీక్స్ కి చేరింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఆ సీటు ఆశిస్తున్న టీడీపీ నేత వర్మ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చంద్రబాబు బుజ్జగించటంతో పవన్ కు మద్దతు తెలిపేందుకు ఒప్పుకున్నాడు.

ఈ ఎన్నికల్లో పవన్ గెలుపు కోసం పని చేస్తానని వర్మ ప్రకటించినప్పటికీ స్థానికంగా ఇరు పార్టీ శ్రేణుల మధ్య సయోధ్య మాత్రం కుదరలేదు. స్థానిక నేత వర్మను కాదని పిఠాపురం సీటు జనసేనకు కేటాయించటం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇచ్చేది లేదని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో స్థానిక జనసేన క్యాడర్ టీడీపీ క్యాడర్ పై దాడికి దిగుతున్నారని వర్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ పల్లకి మోసినంత మాత్రాన ఇలా దాడులు చేస్తే చేతులు కట్టుకు కూర్చోమని అన్నారు.