వీడియో: జనసేన నాయకుడితో కాళ్లు పట్టించుకున్న టీడీపీ నేత

కృష్ణాజిల్లా: మచిలీపట్నం, పరాసుపేటలో జనసేన నాయకుడి చేత టీడీపీ శ్రేణులు కాళ్లు పట్టించుకున్న ఘటన కలకలం రేపింది. బ్యానర్ ఏర్పాటు చేసిన విషయంలో తలెత్తిన చిన్న వివాదంలో టీడీపీ నేతలు జోక్యం చేసుకుని జనసేన నాయకుడి చేత కాళ్లు పట్టించుకుని క్షమాపణ చెప్పించుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

పరాసుపేటకు చెందిన యర్రంశెట్టి నాని అనే స్థానిక జనసేన నాయకుడు ఇటీవల వినాయకచవితి శుభాకాంక్షల పేరుతో ఓ బ్యానర్ ఏర్పాటు చేశాడు. అందులో కూటమి నేతల ఫోటోలు లేకపోవడంతో అదే పార్టీకి చెందిన కర్రి మహేష్‌‌తో అనే యువకుడితో వివాదం తలెత్తింది. ఈ విషయమై రెండ్రోజుల క్రితం ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వారు కావడంతో వివాదం సద్దుమణిగి పోయిందని అంతా అనుకున్నారు. కానీ, ఈ ఘటనలో టీడీపీ నాయకులు కలగజేసుకోవడంతో గొడవ మరింత వివాదస్పదం అయ్యింది. 

కాళ్లతో తంతూ.. 

తమ ఫోటోలు వేయకపోవడం, బ్యానర్ చింపేశాడన్న ఆరోపణలపై టీడీపీ నేత శంకు శీను అనే వ్యక్తి.. యర్రంశెట్టి నాని ఇంటిపై దాడికి దిగాడు. ఇంట్లో ఉన్న టీవీలు ఫర్నిచర్‌ ధ్వంసం చేశాడు. అంతటితో అతని లీలలు ఆగలేదు. యర్రంశెట్టి నాని చేత బలవంతంగా కాళ్లు పట్టించుకోని క్షమాపణలు చెప్పించుకున్నాడు. కాళ్లు పట్టుకోకపోతే ప్రాణాలతో మిగలవని బెదిరించి అతని చేత ఇలా చేయించారు. అదే సమయంలో మరో వ్యక్తి అతన్ని కాళ్లతో తంతుండటం వీడియోలో చూడవచ్చు. ఈ దాడిని అడ్డుకోబోయిన బాధితుడి(నాని) బావ శాయన శ్రీనివాసరావు సైతం ఈ దాడిలో గాయపడ్డారు. ఈ ఘటనపై ఇరు వర్గాలు చిలకలపూడి స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.