ఏపీలో NDA దే విజయం: చంద్రబాబు

అమరావతి: రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో NDA కూటమి విజయం అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. చిలకలూరి పేట లో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్వంలోజరిగిన  ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ.. కూటమికి మోదీ అండ ఉందన్నారు. మూడు పార్టీల జెండాలు వేరైనా ఎజెండా ఒక్కటే..ప్రజాసంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ మా ఎజెండా అన్నారు చంద్రబాబు. ప్రజల ఆకాంక్షల కోసమే మేం పనిచేస్తామన్నారు చంద్రబాబు.రాబో యే ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పుపై  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉందన్నారు చంద్రబాబు. 

2014 తర్వాత సవాళ్లను, సమస్యలను అధిగమించి నవ్యాంధ్ర స్థాపన కోసం ముందుకు సాగామన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. కేంద్రంలోని ప్రధాని మోదీ సహకారంతో 11 జాతీయ విద్యాసంస్థలను రాష్ట్రంలో నెలకొల్పామన్నారు. మోదీ చేతుల మీదుగా ఏపీ రాజధాని అమరాతి నిర్మాణంలో శ్రీకారం చుట్టామన్నారు. అమరావతి పూర్తయి ఉంటే దేశంలోనే బ్రహ్మాండమైన నగరంగా ఉండేదన్నారు. మూడు ముక్కలాటతో అమరావతిని నాశనం చేసి .. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు చంద్రబాబు. 

పోలవరం ప్రాజెక్టును మా హయాంలో 72 శాతం పూర్తి చేస్తే.. జగన్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టను గోదావరిలోకలిపిందన్నారు. వైసీపీ పాలనలో అన్ని ప్రాజెక్టులు నష్టపోయాయన్నారు. సహజ వనరులను దోచుకున్నారని అరోపించారు చంద్రబాబు. సాండ్, లాండ్, వైన్, మైన్స్ అన్నింట్లోనే  వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారన్నారు చంద్రబాబు. ఓటేసిన ప్రజలను పన్నుల భారంతో కాటేశారు.పెట్టుబడులు రాకుండా చేశారు..ఐదేళ్లో రోడ్లు లేవు.. ప్రాజెక్టులు లేవు.. పరిశ్రమలు లేవు..ఉద్యోగాలు లేవు.. ఉపాధి లేదు ప్రజాజీవితంలో ఆనందం కూడా లేకుండా చేశారని  చంద్రబాబు విమర్శించారు. 

ఈ సభలో ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తారు చంద్రబాబు. మోదీ అంటే ఒక వ్యక్తి కాదు.. భారత దేశాన్ని విశ్వ గురువుగా మారుస్తున్న ఒక శక్తి అన్నారు చంద్రబాబు. మోదీ అంటే సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణ అని అన్నారు. ప్రపంచం మెచ్చిన గొప్ప నాయకుడు మోదీ అన్నారు. నోట్ల రద్దు వంటి సంస్కరణలతో దేశ ముఖచిత్రాన్ని మారుస్తున్నారని చంద్రబాబు చెప్పారు. ప్రజాసంక్షేమానికి కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి మోదీ అన్నారు.