న్యూఢిల్లీ: త్వరలో కొలువుదీరనున్న మోదీ సంకీర్ణ సర్కారులో బెర్తుల కోసం పోటీ మొదలైంది. ఈసారి బీజేపీ మెజార్టీ సీట్లను సాధించకపోవడంతో ఎన్డీయేలోని మిత్రపక్షాలు కీలకంగా మారాయి. టీడీపీ, జేడీయూ కింగ్ మేకర్స్‌గా అవతరించడంతో మోదీ ముందు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు, జేడీయూ చీఫ్ నితీశ్‌కుమార్ తమ డిమాండ్ల చిట్టాను ఉంచినట్లు తెలిసింది. తాము ఎన్డీయేతోనే ఉంటామని, తమకు కేంద్ర సర్కారులో కీలక అవకాశాలు కల్పించాలని అడుగుతున్నట్లు సమాచారం. సంకీర్ణ సర్కారు కావడంతో బీజేపీ కూడా వాటికి సానుకూలంగానే స్పందిస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ ఆ డిమాండ్లను నెరవేర్చలేని పక్షంలో వాటికి సరిపోయే స్థాయిలో ఇతర పదవులను ఇవ్వాలని ఆలోచిస్తున్నది.
చంద్రబాబు, నితీశ్ ఏం ఆశిస్తున్నరు?
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలోని బీజేపీకి 240 సీట్లు రాగా.. ఆ తర్వాత ఎక్కువ సీట్లు (16) తెచ్చుకున్న పార్టీగా టీడీపీ అవతరించింది. జేడీయూకు 12 సీట్లు వచ్చాయి. ఇటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారాన్ని చేపట్టనున్న టీడీపీ.. కేంద్రంలో కూడా కీలక మంత్రి పదవులను ఆశిస్తున్నది. ఐదు కేంద్ర మంత్రి పదవులతోపాటు లోక్‌సభ స్పీకర్ పోస్టును తెలుగుదేశం పార్టీ కోరుతున్నట్లు తెలిసింది. మంత్రి పదవుల్లో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పదవి కూడా ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా రోడ్లు, పంచాయతీరాజ్, హెల్త్, ఎడ్యుకేషన్ శాఖలను కూడా టీడీపీ ఆశిస్తున్నట్లు తెలిసింది.
వీటికి తోడు ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని మళ్లీ చంద్రబాబు తెరమీదికి తెచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేక హోదా కుదరని పక్షంలో అందుకు తగ్గట్టుగా ఏపీకి నిధులు, సహాయం అందించాలని కోరే చాన్స్ కనిపిస్తున్నది. 12 ఎంపీ సీట్లున్న బీహార్ సీఎం నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జేడీయూ రెండు కేబినెట్ బెర్త్‌లతోపాటు ఒక సహాయ మంత్రి పోస్టు అడుగుతున్నట్టు తెలిసింది. ఇందులో రైల్వే మంత్రిత్వ శాఖ కూడా ఉంది. గతంలో రైల్వే మంత్రిగా నితీశ్‌కుమార్ పనిచేశారు.
సీఎంపీ కోసం నితీశ్ పట్టు!
ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వంలో కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ (సీఎంపీ)ని చేర్చాలని, దీని అమలు కోసం కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని జేడీయూ చీఫ్ నితీశ్కుమార్పట్టుబడుతున్నట్టు తెలిసింది. వాజ్‌పేయి హయాంలోని ఎన్డీయే సర్కార్‌లో కూడా కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ఉండేది. దాని కో ఆర్డినేషన్ కమిటీకి కన్వీనర్‌గా జార్జ్ఫెర్నాండేజ్వ్యవహరించారు. అదే పోస్టును ఇప్పుడు నితీశ్ ఆశిస్తున్నట్టు తెలిసింది.
అడిగినవి ఇవ్వక తప్పని పరిస్థితి!
మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేయనున్న మోదీకి.. ఎన్డీయే కూటమిలోని మిగతా మిత్రపక్షాల మద్దతు తప్పనిసరి. దీంతో వాళ్ల డిమాండ్లను అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2014, 2019 ఎన్నికల్లో కూటమిగానే బీజేపీ పోటీ చేసినప్పటికీ.. ఆ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ (272) సీట్లు రావడంతో తమకు నచ్చినట్టుగా కూటమిలోని మిగతా పక్షాలకు పదవులు ఇస్తూ వచ్చింది. 2019లో 16 ఎంపీ సీట్లు గెలిచిన జేడీయూ.. నాడు నాలుగు కీలక కేంద్ర మంత్రి పదవులు కోరింది. అయితే.. అప్పుడు ఒంటరిగానే బీజేపీకి 303 సీట్లు రావడంతో జేడీయూ డిమాండ్లకు ప్రయారిటీ దక్కలేదు. ఆ తర్వాత కూటమి నుంచి బయటికి వచ్చిన నితీశ్.. మళ్లీ ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. బీజేపీకి ప్రస్తుతం సొంతంగా మెజార్టీ లేకపోవడంతో కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు సర్కారులో ప్రయారిటీ లభించనుంది. కొత్తగా కొలువుదీరే సంకీర్ణ ప్రభుత్వంలో టీడీపీ, జేడీయూతోపాటు శివసేన(షిండే), ఎల్జేపీ వంటి భాగస్వామ్య పార్టీలు కీ రోల్ ప్లే చేయనున్నాయి. తమ డిమాండ్లను సాధించుకునేందుకు ఇప్పటి నుంచే ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.
మిత్రపక్షాల డిమాండ్లను పరిష్కరించలేని పక్షంలో బుజ్జగించి, అదేస్థాయిలో ఆల్టర్నేట్ చూపించేందుకు మోదీ రెడీ అవుతున్నట్టు సమాచారం. మిత్రపక్షాలను మోదీ కలుపుకెళ్లకపోతే ఇండియా కూటమి వైపు ఆ పార్టీలు చూసే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. పైగా తాము ప్రభుత్వ ఏర్పాటు విషయంలో వేచిచూసే ధోరణిలో ఉన్నామని కాంగ్రెస్ చీఫ్, ఇండియా కూటమి నేత ఖర్గే ఇప్పటికే ప్రకటించారు. దీంతో వచ్చే ఐదేండ్లు మోదీ సర్కారులో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మాట చెల్లుబాటు కానుంది.
ఇతర పక్షాలు కూడా..!
కర్నాటకలో రెండు ఎంపీ సీట్లు గెలుచుకున్న మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ నేతృత్వంలోని జేడీఎస్ కూడా కేంద్ర మంత్రి పదవులను ఆశిస్తున్నది. ముఖ్యంగా కుమారస్వామికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. తమది రైతుల పార్టీ అని, అందుకు తగ్గట్టుగా కేంద్ర వ్యవసాయ శాఖ ఇవ్వాలని దేవేగౌడ అడుగుతున్నట్టు తెలిసింది.
ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలోని శివసేన (షిండే) పార్టీ కూడా కేంద్ర మంత్రి పదవుల కోసం లాబీయింగ్ జరుపుతున్నట్టు తెలిసింది. ఆ పార్టీ మహారాష్ట్రలో ఏడు ఎంపీ సీట్లను గెలుచుకుంది.
చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ బీహార్‌లో ఐదు ఎంపీ సీట్లలో గెలువగా.. ఆ పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వంలో తమకు కీలక అవకాశాలు ఇవ్వాలని అడుగుతున్నట్టు సమాచారం.
ఏపీలో రెండు ఎంపీ సీట్లు గెలుచుకున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కేంద్రంలో తమకు ప్రయారిటీ ఇవ్వాలని కోరుతున్నట్టు తెలిసింది.
ఉత్తరప్రదేశ్‌లో ఒక ఎంపీ సీటును గెలుచుకున్న అనుప్రియా పటేల్ నేతృత్వంలోని అప్నాదళ్ (సోనేలాల్) పార్టీ కూడా మరోసారి కేంద్రంలో మంత్రి పదవిని ఆశిస్తున్నట్టు సమాచారం. మోదీ మొదటి, సెకండ్ టర్మ్ పాలనలోనూ అనుప్రియా పటేల్ కేంద్ర మంత్రిగా కొనసాగారు.
కీలక శాఖలు బీజేపీ వద్దే..
టీడీపీ, జేడీయూతో పాటు ఇతర భాగస్వామ్య పక్షాలను కేంద్ర సర్కారులో ఎలా సర్దుబాటు చేయాలనే దానిపై మోదీ నేతృత్వంలో బీజేపీ చర్చలు సాగిస్తున్నది. కీలకమైన హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఐటీ, రోడ్డు రవాణా వంటి శాఖలను తన వద్దే పెట్టుకోవాలని భావిస్తున్నది. డిఫెన్స్, ఫైనాన్స్ మినిస్ట్రీలోని సహాయ మంత్రి పదవులను మాత్రం మిత్రపక్షాలకు ఆఫర్ చేసే అవకాశం ఉంది. టూరిజం, స్కిల్ డెవలప్‌మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి పోర్ట్‌ఫోలియోలను కూడా ఇచ్చే చాన్స్ ఉంది. లోక్‌సభ స్పీకర్ పోస్టును టీడీపీ అడుగుతున్నప్పటికీ.. ఆ పదవి ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా లేదని తెలిసింది. డిప్యూటీ స్పీకర్ పోస్టును ఆఫర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సివిల్ ఏవియేషన్, స్టీల్ వంటి శాఖలను కూడా టీడీపీకి ఇచ్చే చాన్స్ ఉంది. జేడీయూకు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్ శాఖలను ఇవ్వనున్నట్లు తెలిసింది.