రాజ్యసభ ఎన్నికలకు దూరంగా టీడీపీ  

రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) ఓ నిర్ణయానికి వచ్చేశారు.   రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంటుందని తేల్చేశారు. బుధవారం  ( ఫిబ్రవరి 14) ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుతో పలువురు పార్టీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసే అంశంపై అధినేత వద్ద నేతలు ప్రస్తావించారు. అయితే రాజ్యసభ ఎన్నికల్ల పోటీ చేసే ఆలోచన లేదని పార్టీ చీఫ్  చంద్రబాబు తేల్చిచెప్పేశారు. ఈ మేరకు నేతలకు చంద్రబాబు క్లారిటీ ఇచ్చేశారు. చంద్రబాబు నిర్ణయంతో రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండనుంది.

ప్రస్తుతం రాజ్యసభలో టీడీపీకి ఒకే ఒక్క సభ్యుడు ఉన్నారు. ఆయన పదవీ కాలం కూడా త్వరలో ముగియనుంది. ఎన్నికల్లో పోటీ చేయకపోతే రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిథ్యమే లేకుండా పోతుంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారి ఈ తరహా పరిస్థితిని తెలుగుదేశం పార్టీ ఎదుర్కోవాల్సి వస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కేవలం 23స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది. ఆ తర్వాత నలుగురు సభ్యులు ఆ పార్టీని వీడి వైసీపీలో చేరిపోయారు. మరోవైపు వైసీపీ నాయకత్వంతో తలెత్తిన విభేదాలతో నలుగురు సభ్యులు టీడీపీలో చేరారు. వారిపై అనర్హత పిటిషన్ల విచారణ జరుగుతోంది. టీడీపీ శాసన సభ్యుడు గంటా శ్రీనివాస రావు రాజీనామాను కొద్ది రోజుల క్రితం స్పీకర్ అమోదించారు. దీంతో టీడీపీ బలం 18కు పడిపోయింది. 

రాజ్యసభ స్థానాన్ని గెలుచుకోవాలంటే 41 మంది శాసనసభ్యుల మద్దతు అవసరం. అయితే ఇప్పుడున్న బలాబలాలను చూస్తే మాత్రం టీడీపీకి ఒక్క స్థానం కూడా దక్కే అవకాశం లేదు. అయినా పోటీకి దించి ఎన్నికలకు ముందు పరాభావం పాలవ్వడం ఎందుకన్న భావన టీడీపీ అధినేత చంద్రబాబులో కనిపిస్తుంది. 41 మంది సభ్యులు మద్దుతు కావాలంటే మరో 13 మంది ఎమ్మెల్యేలు వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే అంత పెద్ద సంఖ్యలో మద్దతును కూడగట్టడం ఎన్నికల వేళ కష్టమేనని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఈ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. పోటీ చేసి ఓటమి పాలయినా తొలి సారి తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో జీరో గా మారనుంది. తిరిగి 2026లో ఖాళీ అయ్యే స్థానాల్లో గెలిస్తే తప్ప అప్పటి వరకూ పెద్దల సభలో పార్టీకి చోటు ఉండదు.

ఇటీవల సీట్ల సర్దుబాటు, టిక్కెట్ల కేటాయింపుల్లో 30మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లను కేటాయించలేదు. వారంతా టీడీపీకి మద్దతు ఇస్తారని ప్రచారం జరిగింది. వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేల మద్దతుతో టీడీపీ రాజ్యసభను గెలుచుకోవడం సులువని భావించారు. అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ తరహా ప్రయోగాలు ప్రజల్ని ప్రభావితం చేస్తాయనే అనుమానం  టీడీపీలో ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలో రాజ్యసభ ఎన్నికల్లో కూడా విజయం దక్కించుకోవచ్చని భావించినా అది ఎంత మేరకు సాధ్యమనే అనుమానాలు కూడా లేకపోలేదు.

దీంతో రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం కంటే విరమించుకోవడం మేలనే అభిప్రాయానికి వచ్చినట్టు చెబుతున్నారు.   నామినేషన్లకు చివరి తేదీ ఫిబ్రవరి 15గా ఉంది. నామినేషన్ల పరిశీలన ఫిబ్రవరి 16తో పూర్తవుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఫిబ్రవరి 20గా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఫిబ్రవరి 27న ఎన్నికల నిర్వహిస్తారు. వైసీపీ అభ్యర్థులు మినహా ఇంకెవరు నామినేషన్లు దాఖలు చేయకపోతే ఏకగ్రీవం అయ్యే అవకాశాలున్నాయి.

మరోవైపు రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ నామినేషన్లు దాఖలు చేయకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ నాయకుల నుంచి ఎన్నికల్లో పోటీ చేయడంపై ఒత్తిడి ఉన్నా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు  మాత్రం వాటికి తలొగ్గడం లేదని చెబుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యే కంటే దూరంగా ఉండటం మంచిదని వారిస్తున్నట్లు చెబుతున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన స్థానాలను దక్కించుకుంటే మళ్లీ రాజ్యసభలో అడుగు పెట్టడం పెద్ద విషయం కాదని నచ్చ చెబుతున్నట్టు తెలుస్తోంది..