భారీగా ప్లాన్ చేసిన కూటమి - 'ప్రజాగళం' సభకు పది లక్షల మంది..

2024 ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది. ఏపీలో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల జాబితాలు ప్రకటించటంతో నేతలంతా ప్రచారానికి సిద్ధమవుతున్నారు. వైసీపీ అధినేత సీఎం జగన్ 'సిద్ధం' సభలతో ప్రతిపక్షాల కంటే ముందే ప్రజల్లోకి వెళ్లగా, జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న టీడీపీ, జనసేన కూటమి ప్రజాగళం పేరుతో భారీ బహిరంగ సభ నిరవహించేందుకు సిద్ధమైంది. ఈ నెల 17న జరగనున్న ఈ బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరవుతున్నారు.

పదేళ్ల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధాని మోడీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే వేదికను పంచుకోనున్నారు. కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సభను చిలకలూరిపేటలో 300ఎకరాల్లో పదిలక్షల మంది జనంతో ప్లాన్ చేస్తోంది. వైసీపీ నిర్వహించిన సిద్ధం సభలకు ధీటుగా ఉండేలా ప్రజాగళం సభను ప్లాన్ చేసింది బాబు అండ్ కో. మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న ఈ సభ ద్వారా ప్రజలకు బలమైన సందేశాన్ని ఇవ్వాలని మూడు పార్టీల నేతలు భావిస్తున్నారు.

2019 ఎన్నికలకు ముందు ఎన్డీయే కూటమి నుండి బయటికి వచ్చాక చంద్రబాబు మోడీపై చేసిన విమర్శల నేపథ్యంలో ఇప్పుడు ఒకే వేదికపై బాబు, మోడీలు కలుస్తుండటం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సభలో ప్రధాని మోడీ జగన్ సర్కార్ మీద విమర్శలు చేస్తారా లేక కూటమి గురించి సందేశంతోనే సరిపెడతారా అన్నది చూడాలి.