AP Elections 2024: మాచర్లలో టెన్షన్ టెన్షన్.. MLA అభ్యర్థి పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల దాడి

ఆంధ్రప్రదేశ్‌లో ఓటింగ్‌ శాతం అంతకంతకూ పెరుగుతోంది. ఉదయం మందకొడిగా సాగినప్పటికీ.. క్రమంగా పుంజుకుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40 శాతం పోలింగ్‌ జరగ్గా.. 3 గంటల సమయానికి 55 శాతానికిపైగా పోలింగ్ నమోదు అయ్యింది. ఇది బాగానే ఉన్నా.. పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరిపై మరొకరు దాడులకు దిగుతున్నారు. ఇదిలావుంటే, మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడికి దిగారు.

పోలింగ్ సరళిని పరిశీలించేందుకు స్థానికంగా ఉన్న పోలింగ్ బూత్‌కు ఆయన బయలుదేరుతున్న క్రమంలో ఈ దాడి జరిగింది. ప్రత్యర్థులు కర్రలు, రాడ్లు, మారణాయుధాలతో దాడికి దిగారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైసీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో పిన్నెల్లి కారు ధ్వంసమవ్వగా.. ఆయన తనయుడు గౌతమ్‌రెడ్డి గాయపడినట్లు సమాచారం అందుతోంది.

పిన్నెల్లి బ్రదర్స్ హౌస్ అరెస్ట్

కాగా, ఉదయం నుంచి మాచర్ల నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటుండడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు.