టీసీఎస్​ లాభం రూ.10,846 కోట్లు

టీసీఎస్​ లాభం రూ.10,846 కోట్లు

న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ టీసీఎస్​ పోయిన ఏడాది డిసెంబరుతో ముగిసిన మూడో క్వార్టర్​లో రూ.10,846 కోట్ల లాభం సంపాదించింది. 2021 డిసెంబరు క్వార్టర్​లో వచ్చిన లాభం రూ.9,806 కోట్లతో పోలిస్తే ఇది 10.98 శాతం పెరిగింది. కన్సాలిడేటెడ్​ రెవెన్యూ సీక్వెన్షియల్​గా 5.3 శాతం పెరిగి రూ.58,229 కోట్లుగా రికార్డు అయింది. ఎనలిస్టులు అంచనా వేసిన మొత్తం రూ.56,893 కంటే ఇది ఎక్కువగా ఉండటం విశేషం. ఈసారి టీసీఎస్​కు రూ.11,200 కోట్ల లాభం వస్తుందని అంచనా వేయగా, అంత మొత్తం రాలేదు. షేరుకు రూ.67 చొప్పున స్పెషల్​ డివిడెండ్​ను, షేరుకు రూ.8 చొప్పున ఇంటెరిమ్​ డివిడెండ్​ను చెల్లించాలని టీసీఎస్​ నిర్ణయించింది. నిలకడైన కరెన్సీలో కంపెనీ రెవెన్యూ వార్షికంగా 13.5 శాతం పెరిగింది. క్లౌడ్ సర్వీసులు, మార్కెట్​ షేరు పెరగడం, ఉత్తర అమెరికా, యూకే వ్యాపారాలు బాగుండటం వల్ల ఫలితాలు అద్భుతంగా వచ్చాయని టీసీఎస్​ సీఈఓ రాజేశ్​ గోపీనాథన్​ అన్నారు. ఇక ముందు కూడా ఆశించిన టార్గెట్లను అందుకుంటామని అన్నారు. టీసీఎస్​ ఈ క్వార్టర్​లో 7.5 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు సాధించింది. పోయిన రెండు క్వార్టర్ల ఆర్డర్లతో పోలిస్తే ఈ మొత్తం కొంచెం తక్కువ. ఇబిటా/ఆపరేటింగ్​ మార్జిన్ సీక్వెన్షియల్​గా​ 50 బేసిస్​ పాయింట్లు పెరిగి 24.5 శాతం నమోదయింది. ప్రొడక్టివిటీ బాగుండటం, కరెన్సీ సపోర్ట్​ వల్ల ఆపరేటింగ్​ మార్జిన్​ బాగుందని టీసీఎస్​ చీఫ్​ ఫైనాన్షియల్​ ఆఫీసర్​ సమీర్​ సేక్​సరియా అన్నారు. 

ఇతర దేశాల్లో పనితీరు ఇలా..

ప్రధాన మార్కెట్లలో ఉత్తర అమెరికా,  యూకేలో ఈ కంపెనీ అమ్మకాలు 15శాతానికి పైగా పెరిగాయి. ఈ రెండు మార్కెట్లు  టీసీఎస్​  మొత్తం ఆదాయంలో మూడింట రెండోవంత  వరకు ఉన్నాయి.   లాభాలలో నాలుగింట మూడో వంతు వరకు ఉన్నాయి. కాంటినెంటల్ ఐరోపాలో వృద్ధి 9.7శాతం వరకు ఉంది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో, లాటిన్ అమెరికా 14.6 శాతం పైగా వృద్ధి చెందగా, భారతదేశం, ఆసియా పసిఫిక్,  మిడిల్ ఈస్ట్ & ఆఫ్రికా మార్కెట్లు 8-9శాతం పైగా పెరిగాయి. ఈసారి డిమాండ్​లో ఏమీ మార్పు లేదని, క్లయింట్ల నిర్ణయాలు ఎలా ఉంటాయనే విషయం కొన్ని నెలల తరువాతే తెలుస్తుందని గోపీనాథన్ పోస్ట్- ఎర్నింగ్స్ కాన్ఫరెన్స్‌‌‌‌లో విలేకరులతో అన్నారు.  ఈసారి పరిశ్రమలు, బ్యాంకులు, ఆర్థిక సేవలు  బీమా (బీఎఫ్​ఎస్​ఐ) సెగ్మెంట్​ బాగా పెరిగింది.  ఇది డిసెంబర్ క్వార్టర్​లో 11శాతం వృద్ధిని సాధించింది. రిటైల్  సీపీజీ రంగం అత్యధికంగా 19 శాతం వృద్ధిని నమోదు చేసింది. లైఫ్ సైన్సెస్,  హెల్త్‌‌‌‌కేర్ వర్టికల్స్ 14.4 శాతం వరకు పెరిగాయి. కమ్యూనికేషన్లు,  మీడియా వర్టికల్ 13.5శాతం, టెక్నాలజీ & సేవలు 13.6శాతం,  తయారీ 12.5శాతం వృద్ధిని సాధించాయని గోపీనాథన్​ వివరించారు.  ఈ క్వార్టర్​లో 2,197 మంది కంపెనీని వీడారు.