ఇన్​కమ్​ ట్యాక్స్  సక్రమంగా చెల్లించాలి : సుమిత పరిమట

వనపర్తి, వెలుగు: ఇన్​కమ్​ ట్యాక్స్​ రిఫండ్ కు అక్రమ మార్గాలు ఎంచుకోవద్దని, ట్యాక్స్​ సక్రమంగా చెల్లించి దేశాభివృ ద్ధికి సహకరించాలని ఇన్​కమ్​ ట్యాక్స్​ డిపార్ట్​మెంట్​ అడిషనల్​ కమిషనర్ సుమిత పరిమట సూచించారు. శుక్ర వారం కలెక్టరేట్​ మీటింగ్​ హాల్​లో ఉద్యోగులకు ఇన్​కమ్​ ట్యాక్స్​ రిటర్న్  దాఖలుపై  ఏర్పాటు చేసిన ఒకరోజు వర్క్ షాప్ కు ఆమె జిల్లా ఇన్​చార్జి కలెక్టర్  సంచిత్  గంగ్వార్ తో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదాయ పన్నులో మినహాయింపులకు ప్రభుత్వం అవకాశం కల్పించినా సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు. చాలా మంది ఉద్యోగులు పన్ను మినహాయింపు పొందేందుకు తప్పుడు సమాచారం నమోదు చేస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. ఢిల్లీలో 20 శాతం, మహారాష్ట్రలో 30 శాతం రిఫండ్  తీసుకుంటుంటే, ఉమ్మడి మహబూబ్​నగర్  జిల్లాలో చాలా మంది 90 నుంచి 100 శాతం రిఫండ్  తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

హైదరాబాద్  రేంజ్–-5 పరిధిలో 14 వేల తప్పుడు వివరాలు సమర్పించిన రిటర్న్​లు గుర్తిస్తే, అందులో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవి 10,635 ఉన్నాయని తెలిపారు. వివిధ అంశాలకు చెందిన వివరాలు ఎప్పటికప్పుడు తమకు అందుతాయని, అక్రమంగా రిఫండ్  చేసిన సొమ్ముతో పాటు 1.30 శాతం వడ్డీ, 200 శాతం జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అడిషనల్​ కలెక్టర్  నగేశ్, ఇన్​కమ్​ ట్యాక్స్​ జిల్లా ఆఫీసర్​ మనోజ్ కుమార్  పాల్గొన్నారు.