పెట్రోల్‌ బంకుల్లో కరెంట్ బండ్లకు టాటా చార్జింగ్‌ స్టేషన్లు

పెట్రోల్‌ బంకుల్లో కరెంట్ బండ్లకు టాటా చార్జింగ్‌ స్టేషన్లు

Tata Power,HPCL,Electric Vehicals,Charging Stations,Petrol Pumps
ముంబై: దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. అయితే వీటి అవసరాలకు తగ్గట్టుగా బయట చార్జింగ్ స్టేషన్లు లేకపోవడంతో ఎక్కువ మంది వాటి వైపు మొగ్గుచూపడం లేదు. ఈ నేపథ్యంలో పెట్రోల్‌ బంకుల్లో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌కు చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు టాటా పవర్ కంపెనీ సిద్ధమైంది. ఇందుకోసం హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం దేశంలోని మేజర్ సిటీలు, హైవేలపై ఉన్న హెచ్‌పీ బంకుల్లో ఎలక్ట్రికల్ వెహికల్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఈ సదుపాయం అందుబాటులోకి రావడం ద్వారా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నవాళ్లు కేవలం సిటీల లోపలే తిరగడం కాకుండా ఎటువంటి భయం లేకుండా హైవేపై దూర ప్రయాణాలు కూడా చేసే వీలు కలుగుతుందని టాటా పవర్ ఈవీ చార్జింగ్ హెచ్ సందీప్ బంగియా అన్నారు. దేశంలో 18 వేలకు పైగా పెట్రోల్‌ బంకుల్లో దశల వారీగా వీటిని ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా చార్జింగ్ స్టేషన్ల రెవల్యూషన్‌ రానుందన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 100 సిటీల్లో 500 పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను సొంతంగా తాము ప్రారంభించామని చెప్పారు. వీటిని పెట్రోల్ పంపులు, మెట్రో స్టేషన్లు, షాపింగ్ మాల్స్, థియేటర్ల వద్ద, హైవేలపై ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.