18 శాతం పెరిగిన రెవెన్యూ
షేరుకు రూ.8 చొప్పున డివిడెండ్
న్యూఢిల్లీ : భారతదేశపు అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సేవల ఎగుమతిదారు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో క్వార్టర్లో సత్తా చాటింది. ఈ ఏడాది సెప్టెంబరు తో ముగిసిన క్వార్టర్ ఫలితాల విషయంలో ఎనలిస్టుల అంచనాలను అందుకుంది. ఆదాయం 18శాతం వార్షిక వృద్ధితో రూ. 55,309 కోట్లకు చేరింది. నికర లాభం 8.4శాతం పెరిగి రూ. 10,431 కోట్లకు చేరుకుంది. ఈ కంపెనీకి గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ.9,624 కోట్ల లాభం వచ్చింది. టీసీఎస్ ఈక్విటీ షేర్‌కు రూ.8 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్‌ను కూడా ప్రకటించింది. అయితే పన్నుకు ముందు లాభం (పీఏటీ) మొదటిసారిగా రూ. 10 వేల కోట్ల మార్కును దాటినప్పటికీ కంపెనీ నిర్వహణ మార్జిన్ ఏడాది లెక్కన 24 శాతం నుంచి 1.6శాతానికి తగ్గింది. “మా సేవలకు డిమాండ్ బలంగా కొనసాగుతోంది. మా అన్ని ప్రధాన మార్కెట్‌లలో బలమైన, లాభదాయకమైన వృద్ధిని సాధించాం. అన్ని వర్టికల్స్ పనితీరు బాగుంది. క్లౌడ్ మైగ్రేషన్, ఔట్‌సోర్సింగ్ ఎంగేజ్‌మెంట్‌లతో ఆర్డర్ బుక్ బాగానే ఉంది" అని టీసీఎస్ సీఈఓ, ఎండీ రాజేష్ గోపీనాథన్ అన్నారు. నిలకడైన కరెన్సీ పరంగా, ఈ ఐటీ మేజర్ ఆదాయం సంవత్సరానికి 15.4 శాతం పెరిగింది. రిటైల్, సీఎంఐ సెగ్మెంట్ల నేతృత్వంలోని వర్టికల్స్ అంతటా భారీ వృద్ధి కనిపించింది. టీసీఎస్ ఆర్డర్ బుక్ విలువను 8.1 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టారు. ఈ విషయమై టీసీఎస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సమీర్ సేక్సరియా మాట్లాడుతూ సరఫరా సవాళ్లు మెల్లమెల్లగా తగ్గుతున్నాయని, ఇక నుంచి కంపెనీ పరిస్థితులు మరింత బాగుంటాయని చెప్పారు.
ఉత్తర అమెరికాలో దూకుడు
ప్రధాన మార్కెట్లలో ఉత్తర అమెరికా 17.6శాతం వృద్ధితో ముందుంది. కాంటినెంటల్ యూరప్ 14.1శాతం, యూకే మార్కెట్ 14.8శాతం పెరిగింది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో, భారతదేశం 16.7శాతం, లాటిన్ అమెరికా 19.0శాతం, మిడిల్ ఈస్ట్ & ఆఫ్రికా 8.2శాతం ఆసియా పసిఫిక్ మార్కెట్లు 7.0శాతం పురోగమించాయి. సెగ్మెంట్ వారీగా చూస్తే రిటైల్ సీపీజీ 22.9 శాతం పెరిగింది. కమ్యూనికేషన్స్ & మీడియా (18.7 శాతం), టెక్నాలజీ & సేవలు (15.9 శాతం), తయారీ లైఫ్ సైన్సెస్ & హెల్త్‌కేర్ వర్టికల్స్ 14.5 శాతం వృద్ధి చెందగా, బీఎఫ్ఎస్ఐ 13.1 శాతం పెరిగింది. టీసీఎస్ ఈ క్వార్టర్లో 9,840 మంది ఉద్యోగులను చేర్చుకుంది. గత పన్నెండు నెలల ప్రాతిపదికన ఐటీ సేవలలో అట్రిషన్ రేటు 21.5శాతం రికార్డయింది. "మా క్వార్టర్లీ యాన్యులైజ్డ్అట్రిషన్ ప్రస్తుత క్వార్టర్ గరిష్ట స్థాయికి చేరుకుందని అనుకుంటున్నాం. ఈ పాయింట్ నుండి ఇది తగ్గుతుందని భావిస్తున్నాం. అయితే అనుభవజ్ఞులైన నిపుణులకు చెల్లింపులు మధ్యస్థంగా ఉంటాయి. మొత్తం ఉద్యోగుల సంఖ్య 6.16 లక్షలకు చేరింది" అని టీసీఎస్ చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ అన్నారు. ఒక్కో షేరుకు రూ.8 చొప్పున ఇంటెరిమ్ డివిడెండ్ చెల్లిస్తామని టీసీఎస్ ప్రకటించింది. రెండో మధ్యంతర డివిడెండ్‌కు టీసీఎస్ అక్టోబర్ 18ని రికార్డ్ డేట్‌గా, నవంబర్ 7ని చెల్లింపు తేదీగా నిర్ణయించామని అని టీసీఎస్ తన క్వార్టర్లీ రిజల్ట్స్ ప్రకటిస్తూ ఎక్స్‌ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.--- ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో టీసీఎస్ షేరు రెండు శాతం లాభంతో రూ.3,121 వద్ద ముగిసింది.
