వెనక్కి ప్రయాణించిన రైలు.. తప్పిన భారీ ముప్పు

వెనక్కి ప్రయాణించిన రైలు.. తప్పిన భారీ ముప్పు

ముందుకు వెళ్లాల్సిన ఓ రైలు కొన్ని కిలోమీటర్లు వెనక్కి ప్రయాణించింది. ఆ సమయంలో పట్టాలపై ఎవరు లేకపోవడం, వేరే రైళ్లు రాకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది. ఢిల్లీ నుంచి తనక్‌పూర్‌ వెళ్తున్న పూర్ణగిరి జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలు బధువారం 35 కిలోమీటర్లకు పైగానే రివర్స్‌లో ప్రయాణం చేసింది. సడెన్‌ బ్రేక్‌ వేయడంతో ఇలా జరిగిందని అధికారులు తెలిపారు.

సడెన్‌గా పట్టాలపైకి ఓ జంతువు వచ్చిందని..దాని ప్రాణాలను కాపాడటం కోసం సడెన్‌ బ్రేక్‌ వేశారని తెలిపారు చంపావత్ ఎస్పీ లోకేశ్వర్ సింగ్. దీంతో రైలు దానికదే వెనక్కి ప్రయాణించడం ప్రారంభించిందన్నారు. ఆ సమయంలో 60 నుంచి 70 మంది ప్రయాణీకులు రైలులో ఉన్నారన్నారు. చివరికి రైలు ఖతిమా దగ్గర ఆగింది. ఆ తర్వాత ప్రయాణీకలను తనక్‌పూర్‌కి బస్‌లో పంపించామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి లోకో పైలెట్‌, గార్డ్‌ని సస్పెండ్‌ చేసినట్లు నార్త్‌ ఈస్ట్రన్‌ రైల్వే అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి దర్యాప్తు చేయడానికి ఉత్తరప్రదేశ్‌కు చెందిన పిలిభిత్‌ నుంచి సాంకేతిక బృందం ఖతిమాకు చేరుకుంది.