కరుడు గట్టిన ఇద్దరు రౌడీ షీటర్లు పోలీసుల ఎన్ కౌంటర్లు మృతి చెందారు. పోలీసుల తుపాకులు లాక్కొని..వారిపై దాడి చేయడానికి ప్రయత్నించగా..జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు రౌడీ షీటర్లు మరణించారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
ఏఐఏడీఎంకే నాయకుడి హత్య కేసులో రౌడీషీటర్లు అయిన ముత్తు శరవణన్, సతీశ్‌ను ఢిల్లీలో అరెస్టు చేశారు పోలీసులు. వీరిని చెన్నైకి తీసుకొస్తున్నారు. అయితే అక్టోబర్ 12వ తేదీ తెల్లవారుజామున తిరువళ్లూరు జిల్లా చితంపూర్ గ్రామం సమీపంలోకి రాగానే పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకొనేందుకు ప్రయత్నించారు. పోలీస్ సిబ్బందిపై దాడికి పాల్పడి..వారి నుంచి తుపాకులు లాక్కునే ప్రయత్నం చేశారు. అయితే రౌడీ షీటర్లను అడ్డుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరపడంతో..ఇద్దరు రౌడీషీటర్లు చనిపోయారు. మరో రౌడీ షీటర్ గాయపడ్డాడు. అతను పెరియపాలేనికి చెందిన తనిక అలియాస్ తణికాచలంగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆగస్టు 17వ తేదీ 2023లో రెడ్ హిల్స్ లో అన్నాడీఎంకే కార్యకర్త పార్థిబన్ హత్య కేసులో ముత్తు శరవణన్, సతీష్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ హత్య అనంతరం వీరు పరారయ్యారు.
కాల్పులో హతమైన రౌడీషీటర్ ముత్తు శరవణన్ పై అనేక కేసులున్నాయని పోలీసులు తెలిపారు. ఏఐఏడిఎంకే కార్యకర్త పార్థీబన్ హత్య, ఫిబ్రవరి 2022లో మడిపాక్కంలో డీఎంకే కార్యకర్త సెల్వం హత్యతో పాటు..మరో రెండు హత్యాయత్నం కేసులు, ఎనిమిది దోపిడీ కేసుల్లో సహా మొత్తం ఆరు హత్య కేసుల్లో ముత్తు శరవణన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
