హుండీలో పడ్డ ఐఫోన్ దేవుడిదే.. భక్తుడికి తిరిగివ్వడానికి నిరాకరించిన ధర్మకర్తలు

చెన్నై: హుండీలో పడిన ప్రతిది దేవుడి ఖాతాలోకే వెళ్తుందని.. గుడిలో ముడుపులు చెల్లించే పాత్ర(హుండీ, ఉండిగ)లో పడినది ఏదైనా ఆలయ దేవుడి ఆస్తి అవుతుందని తమిళనాడు హిందూమత, ధార్మిక సేవా శాఖ మంత్రి శేఖర్​బాబు వివరించారు. చెంగల్పట్టు జిల్లా తిరుపోరూర్​లోని అరుళ్మిగు కందస్వామి ఆలయంలో శుక్రవారం దినేశ్ అనే భక్తుడు విరాళం వేస్తూ తన ఐఫోన్ హుండీలో పడేసుకున్నాడు. ఆలయ అధికారులను సప్రందించి తన ఫోన్ ఇప్పించాల్సిందిగా కోరారు. అయితే అతని అభ్యర్థనను వారు సున్నితంగా తిరస్కరించారు. 

భక్తుడు ఫోన్ ఇవ్వాల్సిందిగా పట్టుబట్టడంతో విషయం ఉన్నతాధికారులకు తెలిపారు. వారు హండీని ఓపెన్ చేసి ఐఫోన్​ను భద్రపరిచారు. శనివారం చెన్నైలోని మారియమ్మన్, కైలసనాథన్ ఆలయాలను సందర్శించిన మంత్రి శేఖర్​బాబు దీనిపై స్పందించారు. ‘‘హుండీలో సమర్పించిన ప్రతిదీ, అసంకల్పితంగా జరిగినప్పటికీ.. అది దేవుడి ఖాతాలోకి వెళ్తుంది. ధార్మిక ఆచారాలు, ఆలయాల సంప్రదాయల ప్రకారం హుండీలో పడిన ప్రతీది దేవుడికే చెందుతుంది. వాటిని తిరిగి ఇవ్వడానికి నిబంధనలు అనుమతించవు” అని వివరించారు. ఇన్‌‌‌‌స్టాలేషన్, సేఫ్‌‌‌‌గార్డింగ్, అకౌంటింగ్ ఆఫ్ హుండీ రూల్స్ 1975 ప్రకారం హుండీలో సమర్పించిన వాటిని ఏ సమయంలోనైనా యజమానికి తిరిగి ఇవ్వబడవని, అవి ఆలయానికి చెందినవని నిబంధనలు చెప్తున్నాయని తెలిపారు. అయితే అధికారులతో చర్చించి భక్తునికి నష్టపరిహారం ఇచ్చే అవకాశం ఉందో లేదా పరిశీలిస్తానని చెప్పారు.