వాహనదారులకు గుడ్ న్యూస్: లీటర్ పెట్రోల్ పై రూ.3 తగ్గింపు

వాహనదారులకు గుడ్ న్యూస్: లీటర్ పెట్రోల్ పై రూ.3 తగ్గింపు

దేశంలో పెట్రో ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రూ.105 మార్క్ దాటేసి పరుగు పెడుతోంది. దీంతో సామాన్యులు తమ వాహనాలు బయటకు తీయాలంటేనే జంకుతున్నారు. పెట్రోల్ ధర కంటే కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు వేసే పన్నులే చమురు ధరలు పెరగడానికి కారణం. ప్రభుత్వాలు పన్నుల తగ్గించుకుంటే పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త అదుపులోకి వస్తాయని అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్‌పై 3 రూపాయల వరకు సంకం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

దీనికి సంబంధించిన తమిళనాడు ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ శుక్రవారం ప్రకటన చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర ఖజానాకు నష్టం  వస్తున్నప్పటికీ చమురు ధరల నుంచి సామాన్యులకు ఊరట కలిగిచాలన్న ఉద్దేశంతోనే సీఎం స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నారని త్యాగరాజన్ తెలిపారు. లీటరు పెట్రోలుపై రూ.3 ధర తగ్గించడంతో తమిళనాడు రాష్ట్ర ఖజానాకు రూ. 1,160 కోట్ల నష్టం వస్తుందని, అయినా ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

ప్రస్తుతం తమిళనాడులో రూ.102.49 ఉన్న పెట్రోల్‌. స్టాలిన్ సర్కార్ నిర్ణయంతో రూ.100 కంటే తక్కువగా కానుంది. ఇక తమిళనాడు సర్కార్‌ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం పై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో డిఎంకె ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్‌ను సమర్పించింది.