స్పీకర్ చెప్పినా పట్టించుకోలే..అందుకే వాకౌట్:తమిళనాడు గవర్నర్

  • తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్
  • సభలో జాతీయ గీతాన్ని పాడలేదని ఆరోపణ
  • స్పీచ్ చదవకుండానే వెళ్లిపోయిన గవర్నర్

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ వేదికగా జాతీయ గీతానికి అవమానం జరిగిందని ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి మండిపడ్డారు. అసెంబ్లీలో రాష్ట్ర గీతం మాత్రమే పాడటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభోత్సవం సందర్భంగా జాతీయ గీతం పాడాలని స్పీకర్ అప్పావు, సీఎం స్టాలిన్ రిక్వెస్ట్ చేసినా తిరస్కరించారని తెలిపారు. 

అందుకే అసెంబ్లీ సమావేశాల ప్రారంభ ఉపన్యాసం చదవుకుండానే వాకౌట్ చేసినట్లు వివరించారు. తమిళనాడు అసెంబ్లీ సంప్రదాయం ప్రకారం.. సమావేశాల ప్రారంభం రోజు రాష్ట్ర గీతం, ముగింపు నాడు జాతీయ గీతం పాడుతారని అధికార పార్టీ వర్గాలు తెలిపాయి. గవర్నర్ మాత్రం రెండు సార్లు జాతీయ గీతం పాడాలని డిమాండ్ చేశారని, స్పీకర్, సీఎం తిరస్కరించడంతో సభ నుంచి వాకౌట్ చేశారని చెప్పారు.

తమిళనాడులోకే ఎందుకిలా?

అసెంబ్లీలో రాజ్యాంగంతో పాటు జాతీయ గీతానికి అవమానం జరిగిందని గవర్నర్ ఆర్ఎన్ రవి తెలిపారు. ‘‘జాతీయ గీతాన్ని గౌరవించడం మన రాజ్యాంగంలో పొందుపర్చిన మొట్టమొదటి ప్రాథమిక విధి. అన్ని రాష్ట్రాల్లోని అసెంబ్లీల్లో గవర్నర్ ప్రసంగానికి ముందు జాతీయ గీతం ఆలపిస్తారు. కానీ.. తమిళనాడులో మాత్రం అలా జరగడం లేదు. 

నేను సభకు వచ్చినప్పుడు రాష్ట్ర గీతాన్ని మాత్రమే ఆలపించారు.  జాతీయ గీతం పాడాలని స్పీకర్ అప్పావు, సీఎం స్టాలిన్​ను రిక్వెస్ట్ చేశా. కానీ.. వారు పట్టించు కోలేదు. ఇది ఎంతో ఆందోళన కలిగించే అంశం. జాతీయ గీతాన్ని అవమానిస్తుంటే.. సభలో ఉండలేక ప్రసంగించకుండానే వాకౌట్ చేశా’’అని గవర్నర్ ఆర్ఎన్ రవి తెలిపారు. 

కాగా, తమిళనాడు అసెంబ్లీ సంప్రదాయాన్ని ఉల్లంఘించడం గవర్నర్ ఆర్ఎన్ రవికి అలవాటైపోయిందని సీఎం స్టాలిన్ మండిపడ్డారు. రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.