తెలంగాణకు వరద సాయం ప్రకటించిన తమిళనాడు సీఎం

తెలంగాణకు వరద సాయం ప్రకటించిన తమిళనాడు సీఎం

హైదరాబాద్ సిటీ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదల సహాయ చర్యలకు తమ వంతు అండగా నిలిచేందుకు తమిళనాడు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.10 కోట్లు విరాళాన్ని ప్రకటించారు తమిళనాడు సీఎం ఎడిప్పాడి పళనిస్వామి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు.

గతంలో ఎన్నడూ చూడనంత స్థాయిలో హైదరాబాద్ సిటీ వరదలను ఎదుర్కొంటోందని, భారీ వర్షాల కారణంగా వచ్చిన ఈ వరదలతో భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిందని పళనిస్వామి అన్నారు. ఈ విపత్తును ఎదుర్కోవడంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం సమర్థవంతంగా స్పందించిందని చెప్పారు. బాధితులను వేగంగా రెస్క్యూ చేసి, రిలీఫ్ క్యాంపులకు తరలించడం ద్వారా మరిత నష్టం జరగకుండా చూడగలిగారని అన్నారు. ఈ కష్ట సమయంలో తమిళనాడు ప్రజలు, ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నామని పళని స్వామి చెప్పారు. తమ వంతు తక్షణ సాయంగా తమిళనాడు ప్రభుత్వం తరఫున రూ.10 కోట్ల విరాళం అందిస్తున్నామన్నారు. అలాగే దుప్పట్లు, చాపలు వంటి రిలీఫ్ మెటీరియల్ కూడా పంపుతున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కోరితే ఎటుంటి సాయం చేసేందుకైనా తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని పళనిస్వామి తెలిపారు.