నేను సీఎం అయితే బీజేపీతో కలసి పని చేస్తా

నేను సీఎం అయితే బీజేపీతో కలసి పని చేస్తా
చెన్నై: తమిళనాడుకు బీజేపీ అవసరం లేదని కోలీవుడ్ హీరో, ఎంఎన్‌‌ఎం పార్టీ అధినేత కమల్ హాసన్ అన్నారు. బీజేపీని తమిళ ప్రజలు అస్సలు పట్టించుకోవట్లేదని చెప్పారు. ఈ ఏడాది రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా రజనీకాంత్‌‌ను కోరతామన్నారు. ప్రజలను ఆధ్యాత్మక రాజకీయాల్లోకి లాగాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. అయితే వచ్చే తమిళనాడు ఎన్నికల్లో తాను గెలిచి సీఎం అయితే కేంద్రంలోని బీజేపీ సర్కార్‌‌తో కలసి పని చేస్తామన్నారు. ‘నాకు ఆధ్యాత్మికతతో ఎలాంటి శత్రుత్వం లేదు. నన్ను ఆధ్యాత్మికత వైపు నడవాలని ఎవరూ ఒత్తిడి పెట్టలేరు. అలాగే హేతుబద్ధత దిశగా వెళ్లమని నేనూ ఎవరిపైనా ప్రెజర్ తీసుకురాను. బీజేపీ అవసరం తమిళనాడుకు లేదు. ఆ పార్టీని తమిళ ప్రజలు పట్టించుకోవట్లేదు. అయితే జాతి ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ ప్రభుత్వంతో కలసి పని చేయాల్సి వస్తే దానికీ సిద్ధమే. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాం. వివిధ రకాలైన సిద్ధాంతాలు ఉంటే శత్రువులు అయిపోరు. రాజకీయాల్లో నేతలు నిజాయితీగా ఉంటారనేది సమాధులపై రాయడానికి మాత్రమే బాగుంటుంది. నేను తమిళనాడు సీఎం అయితే తొలి సంతకం లోక్‌‌పాల్ బిల్లుపైనే చేస్తా’ అని కమల్ చెప్పారు.