షార్ట్​ ఫిల్మ్స్​ నుంచి సినిమాల వరకు

షార్ట్​ ఫిల్మ్స్​ నుంచి  సినిమాల వరకు

మొదట్లో సరదాగా షార్ట్​ ఫిల్మ్స్​లో నటించాడు. కొన్నింటికి డైరెక్షన్​ కూడా చేశాడు. కానీ, అప్పటివరకు యాక్టర్​ అవ్వాలనే ఆలోచన లేదట. ఎప్పుడైతే నటించాలనుకున్నాడో అప్పటి నుంచి అవకాశాల వేట మొదలుపెట్టాడంట అశోక్ సెల్వన్. కానీ, అనుకున్నంత ఈజీగా ఛాన్స్​లు రాలేదు. ఎన్నో ఆడిషన్స్​లో రిజెక్ట్ అయ్యాడు. అయినా సరే, పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించడంతో ఫైనల్​గా యాక్టర్​ అయ్యాడు. అది కూడా క్యారెక్టర్​ ఆర్టిస్ట్​ కాదు.. ఏకంగా హీరో అయిపోయాడు. తమిళంలోనే కాకుండా తెలుగువాళ్లకూ అశోక్​ పరిచయమే. మరి అతని జర్నీ ఎలా సాగిందో తన మాటల్లోనే...

మాది తమిళనాడులోని ఈరోడ్. నాకు మూడేండ్లప్పుడే మా ఫ్యామిలీ చెన్నైకి షిఫ్ట్​ అయింది. మా అమ్మానాన్న పనీర్​ సెల్వం, మలర్​. అక్కడే శాంతోమ్ హయ్యర్ సెకండరీ స్కూల్​లో చదువుకున్నా. తర్వాత లయోలా కాలేజీలో  విజువల్ కమ్యూనికేషన్స్​లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశా. కాలేజీ చదివే రోజుల్లోనే షార్ట్​ ఫిల్మ్స్​ చేశా. యాక్టర్​గా, కొన్నింటికి డైరెక్టర్​గా మొత్తం పదికి పైగా కంప్లీట్ చేశా. అందులో ఒకటి ‘గ్రీన్​’ అనే షార్ట్​ ఫిల్మ్. దానికి సింగపూర్​లో జరిగిన 2012 ఇంటర్నేషనల్ తమిళ్​ తోత్​ కాన్ఫరెన్స్​లో బెస్ట్​ ఫిల్మ్​ అవార్డ్​ వచ్చింది.  
మూవీ కెరీర్
కాలేజీ చదువు పూర్తయ్యాక, సినిమాల్లో నటించాలని అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టా. ఆ టైంలోనే ప్రకాశ్​ రాజ్ ప్రొడక్షన్​లో వచ్చిన ‘ఇనిదు ఇనిదు’, డైరెక్టర్​ భరత్​ బాల ‘ది నైంటీంత్​ ​స్టెప్’​ వంటి సినిమాల్లో నటించేందుకు ఆడిషన్ చేశా. కానీ, రిజెక్ట్​ అయ్యా. అప్పుడు యాక్టింగ్​ వద్దు అనుకుని, ఎస్​.జె. సూర్య దగ్గర అసిస్టెంట్​గా చేరడానికి ట్రై చేశా. అనుకోకుండా ‘సెవెన్త్​ సెన్స్​’లో సూర్య ఫ్రెండ్​గా నటించే అవకాశం వచ్చింది. అయితే ఆ సీన్లు చివరి వెర్షన్​లో  లేవు. ‘బిల్లా2’లో అజిత్​ చిన్ననాటి క్యారెక్టర్​లో నటించా. ఆ తర్వాత ‘పిజ్జా’ మూవీకి ఆడిషన్​కి వెళ్లా. దానికి కూడా రిజెక్ట్ అయ్యా. అయితే, నా బ్లాక్​ కామెడీ నచ్చడంతో, 2013లో విజయ్ సేతుపతి నటించిన ‘సూదు కవ్వమ్’ అనే సినిమాలో డైరెక్టర్ నలన్ కుమారస్వామి అవకాశమిచ్చారు. అందులో నేను కేశవన్ అనే రోల్​లో కనిపించా. ఆ సినిమా కమర్షియల్​గా పెద్ద సక్సెస్​ అయింది. నాకు కూడా కొంచెం గుర్తింపు తీసుకొచ్చింది ఆ మూవీ. 
పిజ్జా అనుకుంటే విల్లాలో..
‘పిజ్జా’ సీక్వెల్​ కోసం మొదట వైభవ్​ రెడ్డిని అనుకున్నారు. కానీ, తర్వాత ఆ అవకాశం  నాకు వచ్చింది. అదే ‘పిజ్జా 2: విల్లా’ అనే టైటిల్​తో విడుదలైంది. అందులో నేను ఇంగ్లిష్ నవలా రచయిత పాత్రలో నటించా. ఆ క్యారెక్టర్​ కోసం రెండు వారాల్లోనే బరువు పెరిగా, గడ్డం పెంచా. ఆ సినిమా అనుకున్నంత కాకపోయినా బాగానే ఆడింది. అందులో నా పర్ఫార్మెన్స్​కి మంచి మార్కులు పడ్డాయి. దీని తర్వాత 2014లో ఇదే డైరెక్టర్​ సి.వి. కుమార్​ మూడో సినిమా ‘తెగిడి’లో ఛాన్స్​ వచ్చింది. అదొక మర్డర్ మిస్టరీ. ఆ సినిమాలో కూడా నా యాక్టింగ్​కి మంచి పేరు వచ్చింది. కొంచెం గ్యాప్​ తర్వాత 2017లో ‘కూటతిల్ ఒరుతన్’ అనే రొమాంటిక్ కామెడీ ఫిల్మ్, 2018లో నెట్​ఫ్లిక్స్​లో ‘సిలా సమయాంగలిల్’ వంటి సినిమాల​తో ఆడియెన్స్ ముందుకొచ్చా.​ 
గోల్డెన్​ గ్లోబ్​ అవార్డ్​ వరకు...
ప్రియదర్శన్​ డైరెక్షన్​లో వచ్చిన ‘సిలా సమయాంగలిల్’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే... ఆ సినిమాలో ఎనిమిది క్యారెక్టర్స్​ ఉంటాయి. వాళ్లంతా మార్నింగ్ 9గంటలకు పాతాలజీ ల్యాబ్​కి వెళ్లి ఎయిడ్స్ టెస్ట్ కోసం బ్లడ్ ఇస్తారు. ఆ రిజల్ట్స్​ సాయంత్రం 5గంటలకు వస్తాయి. ఆ తర్వాత ఏం జరిగిందనేదే సినిమా. ఆ ఎనిమిది మంది పాత్రల కథ అది. ఈ సినిమా 9వ యాన్యువల్ జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్​ ఫెస్టివల్​, ఏసియన్​ కాంటినెంట్ వంటి అవార్డులు సొంతం చేసుకుంది. గోల్డెన్​ గ్లోబ్​ అవార్డుల్లో ఫైనల్​ రౌండ్​ వరకు వెళ్లింది. ఆ తర్వాత 2020లో నా ఇమేజ్​ ఇంకాస్త పెరిగింది. దానికి కారణం ‘ఓ మై కడవులె’. అప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తైయితే, ఈ సినిమా మరో ఎత్తు. ‘ఓ మై కడవులె’ నా కెరీర్​లోనే బిగ్గెస్ట్​ హిట్​ మూవీ.
తెలుగు, మలయాళంలో...
నేను తమిళవాడిని అయినప్పటికీ, నాకు తెలుగు సినిమాలంటే కూడా ఇష్టం. అందుకనే కెరీర్ స్టార్టింగ్ నుంచి అటు తమిళంతో పాటు, ఇటు తెలుగులోనూ అవకాశాల కోసం ప్రయత్నించా. అయితే, ‘ఓ మై కడవులె’ తర్వాత ‘నిన్నిలా నిన్నిలా’ అనే తెలుగు సినిమాలో ఛాన్స్ వచ్చింది. అది తెలుగులో నా మొదటి సినిమా. ఆ సినిమాకి మంచి పేరు వచ్చింది. దాని తర్వాత ‘ఆకాశం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చా. ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’లో గెస్ట్ రోల్​లో కనిపించా. ఇలా అవకాశమొచ్చిన ప్రతిసారీ తెలుగు ఆడియెన్స్​ని పలకరిస్తున్నా.  
మలయాళంలో మొదటి సినిమానే చరిత్రాత్మక సినిమాలో చేసే ఛాన్స్ వచ్చింది. అదే మోహన్​ లాల్, అర్జున్​ వంటి పెద్ద స్టార్స్ కలిసి నటించిన ‘మరక్కార్: అరబికడలింతె సింహం’ అనే సినిమాలో కనిపించా. పైగా అందులో శత్రువు పాత్రలో నటించడం ఛాలెంజింగ్​గా అనిపించింది. 
40 కథలు రిజెక్ట్ చేశా

  • చిన్నప్పుడు పోలీస్, బిజినెస్ మ్యాన్, మిలిటరీ ఆఫీసర్, క్రికెటర్​ ఇలా ఏవేవో కలలు ఉండేవి. అవన్నీ పక్కన పెట్టి, యానిమేషన్ నేర్చుకుందామని ‘అరెనా మల్టీమీడియా అకాడెమీ’లో చేరా. అందులో విజువల్ కమ్యూనికేషన్స్​ నేర్చుకున్నా. కానీ, అది కూడా నాకు నచ్చలేదు. ఒకరోజు మా ఫ్రెండ్​తో చాట్ చేస్తున్నా. అతను నాతో ‘ఒక యాక్టర్​కి ప్రతిరోజూ కొత్తగా ఉంటుంది’ అని చెప్పాడు. అది నాకు ఇంట్రెస్టింగ్​గా అనిపించింది. అప్పుడు నేను కూడా వాడితోపాటు యాక్టర్​ అవ్వాలని ఫిక్స్ అయ్యా. కానీ, అది అంత ఈజీ కాదని తెలుసు. అయినా సరే, ఆ ప్రాసెస్​ని ఇష్టపడుతూ చేస్తే కష్టం కాదు అనిపించింది. ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా మళ్లీ మళ్లీ సీరియస్​గా ప్రయత్నించాలి అనుకున్నా.
  • నేను యాక్టింగ్​ కోసం ట్రైనింగ్ తీసుకోలేదు. కాలేజీలో ఫ్రెండ్స్​తో కలిసి షార్ట్​ ఫిల్మ్స్ తీసేటప్పుడే నేను యాక్టింగ్ చేసేవాడిని. మేం చేసిన వాటిలో ప్రతి షాట్ చూసుకుని వాటి నుంచి నేర్చుకునేవాళ్లం. చాలా షార్ట్​ఫిల్మ్స్ ఎందుకు చేశానంటే చాలామంది ఫ్యూచర్ డైరెక్టర్స్​ని కలిసినట్టు ఉంటుంది అనేది నా స్ట్రాటజీ. 
  • ‘తెగిడి’ తర్వాత చాలామంది థ్రిల్లర్ స్క్రిప్ట్​లు తీసుకొచ్చారు. కానీ, అవి చేయడం నాకు ఇష్టం లేక, దాదాపు 40 కథలు రిజెక్ట్ చేశా. 
  • నేను మూడు నెలలకొకసారి వేర్వేరు జాబ్స్ చేయాలనుకుంటా. ఎందుకంటే నాకు యాక్టింగ్​తోపాటు, రైటింగ్ కూడా ఇష్టం. అలా లైఫ్​లో డిఫరెంట్​ రోల్స్ ట్రై చేయాలనుకుంటున్నా. 
  • టైం ఎన్న బాస్, నవరస వెబ్​ సిరీస్​లలో కూడా నటించా. లేటెస్ట్​గా ‘మోడ్రన్ లవ్ చెన్నై’ వెబ్​ సిరీస్​లో నటించా. అది అమెజాన్​లో స్ట్రీమ్​ అవుతోంది.