IND vs NZ: క్రికెట్‌లో భారత్‌తో పోటీ పడే దేశం లేదు: దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్

దక్షిణాఫ్రికా లెగ్ స్పిన్నర్ తబ్రైజ్ షమ్సీ భారత్‌కు క్రికెట్ పట్ల ఉన్న మక్కువను ప్రశంసించాడు. ప్రస్తుతం భారత్, న్యూజిలాండ్ జట్లు ముంబై వేదికగా వాంఖడే స్టేడియంలో మూడో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాయి. ఈ సందర్భంగా షమ్సీ వాంఖడే సమీపంలో అనేక మంది భారత యువ క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రాక్టీస్ పిచ్‌ల పై ఎంతోమంది యువ క్రికెటర్లు ఆడుతుండడం చూసి ఆశ్చర్యపోయానని తెలిపాడు. ఇండియాలో స్పిన్ శిక్షణ శిబిరంలో తన అనుభవాన్ని గుర్తుచేసుకున్నాడు.

షమ్సీ మాట్లాడుతూ.. "క్రికెట్‌పై ఆసక్తి చూపించే విషయంలో ప్రపంచంలోని ఏ దేశమైనా భారత్‌తో పోటీ పడగలదా? ఒక మైదానంలో ఎన్ని విభిన్న పిచ్‌లను చూడవచ్చు? మేము స్పిన్నింగ్ క్యాంప్ కోసం భారత్ కు వెళ్ళినప్పుడు 5 ఏళ్ల పిల్లలు ప్రతిరోజూ 2 నుండి 4 గంటల శిక్షణా సెషన్‌లకు రావడం చూశాము. బ్రాడ్‌కాస్టర్లు ముంబైలో చిన్న పిల్లలకు అవిశ్రాంతంగా శిక్షణ ఇస్తున్నారు.".అని షమ్సీ తన ఎక్స్‌లో తెలిపాడు.

షమ్సీ ఇటీవలే దక్షిణాఫ్రికా సెంట్రల్ కాంట్రాక్ట్‌ను వద్దనుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 ఫ్రాంచైజీ లీగ్ ల్లో అవకాశాలను పొందేందుకు అతను సెంట్రల్ కాంట్రాక్ట్‌ వదిలేసుకున్నట్టు స్పష్టంగా అర్ధమవుతుంది. కుటుంబంతో సమయం గడిపేందుకు.. వారిని ఉత్తమంగా చూసుకోవాలనే ఉద్దేశ్యంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు షమ్సీ వెల్లడించాడు. క్రికెట్ సౌతాఫ్రికా డైరెక్టర్ ఎనోచ్ ఎన్‌క్వే షమ్సీ నిర్ణయాన్ని గౌరవించినట్టు తెలుస్తుంది. సౌతాఫ్రికా తరపున షమ్సీ రెండు టెస్టులు.. 50 వన్డేలు.. 72 టీ20 మ్యాచ్ లాడాడు.